మూడు నెలలుగా జీతాలు లేని ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు
– ప్రభుత్వాన్ని వేడుకుంటున్న సిబ్బంది
ఏటూరునాగారం, జూలై6, తెలంగాణ జ్యోతి : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు గత మూడు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వ విధానాలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం” అనే ఆర్థికశాఖ మంత్రి మాటలు క్షేత్రస్థాయిలో అర్థవంతంగా అమలవడం లేదని విమర్శించారు. ఉపాధి పనుల్లో కూలీలతోపాటు హరితహారం, డంపింగ్ యార్డులు, చెరువుల పూడికతీత, నర్సరీ నిర్వహణ వంటి బాధ్యతలు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు నెలకు రూ.10 వేలు వేతనం పొందుతున్నారు. ఈ స్థితిలో వేతనాలు లేకపోవడం వల్ల జీవనం కష్టమవుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సీతక్క తక్షణం స్పందించి జీతాలు విడుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం మండల అధ్యక్షులు పరికి ప్రసాద్, రమేష్, సాంబశివరావు, యాదగిరి, ముకుందరావు, మోహన్ రావు, రఘు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.