గిరిజన గర్భిణికి అంబులెన్స్‌లో సుఖప్రసవం
ఏటూరునాగారం, జులై6, తెలంగాణ జ్యోతి : వాగులు, అడవులు దాటి వచ్చిన అంబులెన్స్ ప్రాణదాతగా మారింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం వీరాపురం సమీపంలోని అడవిలో నివసించే గుత్తి కోయ యువతి సోలం భోజ్జె పురిటినొప్పులతో బాధపడుతూ 108 సర్వీసుకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటి శివలింగంప్రసాద్, పైలట్ కోటి ఘటన స్థలానికి చేరుకుని, భోజ్జెను రోడ్డుపైకి తీసుకువచ్చారు. ఆసుపత్రికి తరలించేలోపే పురిటినొప్పులు అధికమయ్యాయి. చాకచక్యంగా వ్యవహరించిన ఈఎంటి శివలింగంప్రసాద్ అంబులెన్స్‌లోనే సుఖప్రసవం చేశారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన భోజ్జె, తల్లి బిడ్డల్ని ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందజేశారు. దూర ప్రాంత గిరిజన కుటుంబానికి అంబులెన్స్ సిబ్బంది అందించిన సహాయం అభినందనీయమని కుటుంబ సభ్యులు తెలిపారు.