తెలంగాణ క్రీడా మైదానం ఆక్రమణ యత్నం..!
– భోదాపురం గ్రామస్తుల ఆందోళన
వెంకటాపురం, జులై 5, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని భోదాపురం పంచాయతీ కేంద్రంలో లక్షలాది రూపాయల వ్యయంతో పాఠశాల పక్కనే ప్రజల వినియోగానికి ఏర్పాటుచేసిన తెలంగాణ క్రీడా మైదానం, పల్లె ప్రకృతి వనాన్ని కొంతమంది ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇటీవల సిమెంట్ పోల్స్ వేసి ఇళ్ల నిర్మాణానికి సిద్ధమవుతుండడంతో గ్రామస్థులు అప్రమత్తమై పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అయితే ఆక్రమణదారులకు కార్యదర్శి మద్దతుగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామస్థులు రెండు వారాల క్రితమే మండల అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడం వల్ల గ్రామస్తులు ఆవేదనకు గురవుతున్నారు. శుక్ర, శనివారాల్లో మళ్లీ ప్రభుత్వ భూమిని దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా రని తెలిపారు. పల్లె ప్రజల వినియోగానికి రూపొందించిన సమిష్టి ఆస్తి అయిన ఈ క్రీడా ప్రాంగణాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని రెవెన్యూ, పంచాయతీ, పోలీస్ శాఖల సమన్వయంతో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పత్రికా ముఖంగా వారు విజ్ఞప్తి చేస్తున్నారు.