యూరియా కోసం ఆందోళన అవసరం లేదు: ఇంచార్జ్ డీఈఓ బాబు
కాటారం,జులై3, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతులు సాగు చేస్తున్న పంటలకు అవసరమైన యూరియా, కాంప్లెక్స్ ఎరువులు తగిన మేరకు అందుబాటులో ఉన్నాయని జిల్లా ఇన్చార్జ్ వ్యవసాయ అధికారి బాబు తెలిపారు. ఎలాంటి ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. వర్షాకాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని జూన్ నెలలో ఇప్పటికే 300 టన్నుల యూరియాను రైతులకు విక్రయించినట్లు చెప్పారు. జూలై నెలకు కావలసిన యూరియా సరఫరాకు కాటారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్), డీసీఎంఎస్‌లకు అవసరమైన అలాట్‌మెంట్ కోసం ఇండెంట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మండలంలోని ప్రైవేట్ దుకాణాలలో వానాకాలం సీజన్‌కు సరిపడా కాంప్లెక్స్ ఎరువులు అందుబాటు లో ఉన్నాయని తెలిపారు. యూరియా కోసం రైతులు ఎటువంటి ఆందోళన చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొన్ని ప్రైవేట్ డీలర్లు కృత్రిమంగా కొరత సృష్టించే ప్రయత్నాలు చేయవద్దని, అటువంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.