కాటారంలో మిషన్ భగీరథ నిర్లక్ష్యం
–నీటి కోసం అల్లాడుతున్న ప్రజలు
కాటారం, జూలై 03, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో మూడు వారాలుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కాటారం రెవెన్యూ గ్రామానికి నీరు పంపిణీ చేసే ప్రధాన పైప్‌లైన్ పగిలిపోయిన తర్వాత, దాన్ని రిపేర్ చేసిన మరుసటి రోజే మళ్లీ భారీ లీకేజీ ఏర్పడింది. జెసిబి సహాయంతో మట్టిని తొలగించగా పైపులైన్ పూర్తిగా ధ్వంసమైపోయింది. బుధవారం మరమ్మత్తులు చేసినట్లు గ్రామ కార్యదర్శి ప్రకటించినా, వాటర్ ట్యాంక్ నుండి నీరు వదిలిన వెంటనే లీకేజీ పాయింటులో భారీగా నీరు కారడంతో ప్రజలకు తాగునీరు అందలేదు.
పాలన లేక.. పరిష్కారాలు కనిపించని పరిస్థితి
కాటారం గ్రామపంచాయతీకి పాలకవర్గం లేకపోవడం, నిధుల కొరత, ప్రత్యేక అధికారి పోస్టు ఖాళీగా ఉండటం వంటి పరిపాలనా లోపాలు సమస్యను మరింత దుశ్చింతకు గురి చేశాయి. పైపులైన్ రిపేర్‌కు కావాల్సిన నిధులు లేకపోవడంతో పనులు రోజుకోసారి ఆగిపోతున్నాయి. మండలానికి స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న డిఆర్డిఓ నరేష్ బదిలీ అయ్యాక కొత్తగా వచ్చిన అధికారికి ఇప్పటి వరకు బాధ్యతలు అప్పగించక పోవడంతో స్థానిక సమస్యలు జిల్లా స్థాయికి చేరకుండానే నిలిచి పోతున్నాయి.
మంత్రి పర్యటన – అధికారుల నిర్లక్ష్యం మారలేదు
ఇటీవల రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కాటారం పర్యటించి నప్పటికీ నీటి సమస్యపై స్థానిక అధికారుల నిర్లక్ష్య ధోరణి అలాగే కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు వినతులు పంపినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం కనబడక పోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండల కేంద్రంలో మంచినీటికి ప్రజలు పోరాడాల్సిన దుస్థితి
మిషన్ భగీరథ వంటి ప్రజా సంక్షేమ పథకం అయినా, సరైన నిర్వహణ లేకపోవడం వల్ల కేంద్ర మండలమైన కాటారంలో కూడా తాగునీటి కోసం ప్రజలు రోజువారీగా ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే పైపులైన్‌ను పూర్తిస్థాయిలో మరమ్మ త్తులు చేసి, బాధ్యతాయుతంగా స్థానిక పరిపాలనను పునరు ద్ధరించాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.