ముత్తారం గిరిజనుల సాహసోపేత చర్య

ముత్తారం గిరిజనుల సాహసోపేత చర్య

ముత్తారం గిరిజనుల సాహసోపేత చర్య

– వాగుపై వంతెన నిర్మాణం శ్రమదానంతో

వెంకటాపురం, జులై3,  తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం ఆలుబాక పంచాయతీ పరిధిలోని ముత్తారం గ్రామం గిరిజనులు ఆదివాసీ ఐక్యతకు నిదర్శనంగా నిలిచారు. దశాబ్దాలుగా వాగుపై వంతెన కోసం ప్రభుత్వాలను ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకపోవడంతో అక్కడి గిరిజనులు స్వయంగా రంగంలోకి దిగారు. బుధవారం గ్రామస్థులు అందరూ కలిసి శ్రమదానంతో ఒంటి కుంట వాగుపై సిమెంట్ పైపులు వేసి తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు. ఈ గ్రామంలో సుమారు 120 కుటుంబాలు నివసిస్తుండగా, వర్షాకాలంలో వాగులు పొంగితే బాహ్య ప్రపంచంతో సంబంధం పూర్తిగా తెగిపోతుంది. ఆలుబాక ప్రధాన రహదారి నుండి ముత్తారం దాదాపు 4.5 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో, రాకపోకలకి ఇదే మార్గం. అయినా ఇన్నాళ్లుగా కనీస రోడ్డు, వంతెన వంటి మౌలిక వసతుల లేకుండా జీవితం సాగిస్తున్న ఆదివాసీలు చివరకు తమ శక్తి సామర్థ్యాలతో మార్గం చేసుకున్నారు. గ్రామ పెద్దలు కుంజా సూరిబాబు, బొగ్గుల లక్ష్మయ్య, బాడిశ కన్నయ్య, సోడి గోపి మొదలైన వారు మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని పెద్దగా ప్రచారం చేస్తూ ఉండగానే ముత్తారం వంటి పల్లెలో కనీస రహదారి, ఇళ్లు లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సీతారాం పురం వంటి పొరుగు గ్రామాలవారు కూడా ఇదే మార్గాన్ని ఉపయోగించాల్సి వస్తుందని పేర్కొన్నారు. గ్రామస్థులంతా ఒకగొంతుగా నిలిచి చేసిన ఈ శ్రమదానం ప్రభుత్వం కళ్లను తెరిపించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పక్కా రహదారి, వాగులపై మట్టివంతెనలకు బదులు పర్మనెంట్ బ్రిడ్జిలు, గిరిజన సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని ముత్తారం గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment