ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు అక్రమాలపై విచారణ జరపాలి
– ఏఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహామూర్తి డిమాండ్
వెంకటాపురం, జూన్27, తెలంగాణ జ్యోతి : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆదివాసీ నవనిర్మాణ సేన (ఏఎన్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కొర్స నర్సింహామూర్తి విమర్శించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బర్లగూడెం గ్రామపంచాయతీలో వంద శాతం ఆదివాసీలున్నా కేవలం మూడు ఇళ్లు మాత్రమే కేటాయించడం అన్యాయం అని అన్నారు. నూగూరు, తిప్పాపురం వంటి గిరిజన గ్రామపంచాయతీలకు ఒక్క ఇల్లు కూడా కేటాయించకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇది కాంగ్రెస్ పార్టీ కుట్ర. గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతున్న పరిస్థితి అని మండిపడ్డారు. ఇందిరమ్మ కమిటీలు కాంగ్రెస్ కార్యకర్తల చేత నియమించారని, పేసా చట్ట ఉల్లంఘన జరిగిందని అన్నారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 ప్రకారం వలస గిరిజనేతరులకు ఇళ్లు కేటాయించడమే రాజ్య విరుద్ధ చర్య అని నర్సింహామూర్తి స్పష్టం చేశారు. గిరిజన ఉప ప్రణాళిక నిధులను గిరిజనేతరుల కోసం వాడడాన్ని తిప్పి వేసేందుకు, త్వరలో రాష్ట్ర హైకోర్టులో కేసు వేస్తాం అని హెచ్చరించారు. బర్లగూడెం, తిప్పాపురం, నూగూరు గ్రామాలకు తక్షణమే ఇళ్ల కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి, పేసా కమిటీల ద్వారా గ్రామ సభలతో లబ్ధిదారులను గుర్తించాలన్నారు.