గుడి భూమిని తాత్కాళికంగానే ఉపయోగిస్తాం
– ప్రజల సౌకర్యార్థం తాత్కాళిక ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు
– నూతన బస్టాండ్ నిర్మాణం కాగానే భూమిని గుడికి అప్పగిస్తాం
– ఆలయ భూ పరిరక్షణ కమిటీ సభ్యులతో కలెక్టర్ దివాకర టీఎస్
ములుగు ప్రతినిధి, జూన్25, తెలంగాణ జ్యోతి : ములుగు లోని శ్రీ సీతారామాంజనేయస్వామి (శ్రీక్షేత్రం) ఆలయానికి చెందిన భూమిని తాత్కాళిక ప్రాతిపదికన మాత్రమే ఆర్టీసీ బస్సులు నిలిపేందుకు ఉపయోగిస్తున్నామని, అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన ఆధునిక బస్టాండ్ నిర్మాణం పూర్తి కాగానే గుడి భూమిని తిరిగి యథావిధిగా అప్పగిస్తామని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆలయ భూ పరిరక్షణ కమిటీ సభ్యులకు వివరించారు. ఆలయ కమిటీ అనుమతి లేకుండా సర్వే నెంబర్ 409/ఏ, 409/బీలోని ఎకరం గుడి భూమిలో నిర్మాణాలు చేపడుతున్న విషయం తెలుసుకొని ఆందోళన చేపట్టిన ఆలయ భూపరిరక్షణ కమిటీ సభ్యులు బుధవారం జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. బస్సు షెడ్డు నిర్మాణానికి నిలిపివేయాలని కోరారు. దీంతో కలెక్టర్ వివరణ ఇస్తూ ములుగులో ఆధునిక బస్టాండ్ నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ప్రజలకు రవాణా ఇబ్బందులు కలుగకుండా గుడి మాన్యం భూమిని పరిశీలించి తాత్కాళిక షెడ్లు నిర్మిస్తున్నా మన్నారు. కొత్త బస్టాండ్ నిర్మాణం పూర్తి కాగానే తిరిగి యదా స్థితికి తీసుకువచ్చి అప్పగిస్తామన్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, మళ్లీ ఎకరం ఒక గుంట భూమిని దేవాలయానికి అప్పజెప్పడం జరుగుతుందని తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్, శ్రీ హనుమాన్ ఆలయ భూ పరిరక్షణ సమితి బాధ్యులు సిరికొండ బలరాం, చింత నిప్పుల బిక్షపతి, తోట తిరుపతి, అజ్మీర రాజు నాయక్, మేడుదుల మమన్, అడ్వకేట్ శ్యామ్ సుందర్, కత్తి హరీష్, గండ్రకోట కుమార్, డాక్టర్ సుతారి సతీష్, గంధం విజేందర్, ఎల్కతుర్తి రాజన్న తదితరులు ఉన్నారు.