పాత్రికేయుడిపై దాడిని తీవ్రంగా ఖండించిన జర్నలిస్టు సంఘం
– దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
– టీయూడబ్ల్యూజే ములుగు
ములుగుప్రతినిధి, జూన్24, తెలంగాణ జ్యోతి : తాడ్వాయి మండలం ఆంధ్రజ్యోతి పాత్రికేయుడు చల్లగొండ శ్రీకాంత్ రెడ్డిపై జరిగిన దాడిని ములుగు జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జర్నలిస్టు యూనియన్ తీవ్రంగా ఖండించింది. సంఘం అధ్యక్షుడు ఎం.డి. షఫీ అహ్మద్, కార్యదర్శి వాసుదేవ్ లు మంగళవారం ప్రకటన విడుదల చేసి ఇది మీడియా స్వేచ్ఛపై విరుచుకుపడిన ఘటనగా అభివర్ణించారు. ప్రభుత్వ పథకాల అమలులో అవకతవకలపై విలేకరి వెలుగులోకి తీసుకొచ్చిన కథనాలపై స్పందించాల్సిన అధికార పార్టీ నేతలు దాడులకు దిగడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో విలేకరులు పోషించే పాత్రను అపహాస్యం చేసే ఈ చర్యను అన్ని మీడియా సంస్థలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయని తెలిపారు. ఈ దాడికి పాల్పడిన నార్లాపూర్ గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు భేషరతుగా క్షమాపణ చెప్పాలని, అలాగే పోలీసు శాఖ వారి పైన వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే నేతలు డిమాండ్ చేశారు.