రోడ్డు ప్రమాదంలో యువరైతు మృతి
– అబ్బాయి గూడెం గ్రామంలో విషాదఛాయలు
వెంకటాపురం,తెలంగాణజ్యోతి:ములుగు జిల్లా వెంకటాపురం మండలం మొర్రవాణిగూడెం పంచాయతీకి చెందిన అబ్బాయి గూడెం గ్రామంలో రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ గ్రామానికి చెందిన యువరైతు బొల్లె శేఖర్ (30) రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి… మిర్చి విత్తనాలు కొనుగోలు నిమిత్తం శేఖర్ ద్విచక్ర వాహనంపై భద్రాచలం వెళ్లి తిరుగు ప్రయాణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సుబ్బంపేట వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శేఖర్ తీవ్రంగా గాయ పడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం భద్రాచలం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. శేఖర్తోపాటు ద్విచక్ర వాహనంపై వెనక కూర్చున్న జగదీష్ అనే మరో యువకుడు గాయాలతో బయటపడ్డాడు. మృతదేహానికి భద్రాచలంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆదివారం సాయంత్రం స్వగ్రామం అబ్బాయిగూడెం తీసుకువచ్చారు. బొల్లె శేఖర్ ఒక యువరైతుగా వ్యవసాయ రంగంలో ముందంజలో ఉండి, గ్రామంలో అందరితో కలివిడిగా మెలిగేవాడిగా మంచి పేరొందిన వ్యక్తి. మృతుడికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఆయన మృతితో గ్రామమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది.