ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
– ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో అక్రమాలను అరికట్టాలి : బడే నాగజ్యోతి
– కాటాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
తాడ్వాయి, జూన్ 21, తెలంగాణ జ్యోతి : ఇందిరమ్మ ఇండ్ల మంజూరిలో అక్రమాలను అరికట్టాలని, అర్హులైన ప్రతి పేదకుటుంబానికి ఇల్లు కల్పించాలని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామంలో శనివారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై విరుచుకుపడుతోందన్నారు. ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో నాయకులు, కార్యకర్తలు అవినీతికి పాల్పడుతున్నారని వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. 2023లో బిఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో కాటాపూర్ గ్రామంలో 108 మంది భూమిలేని పేద కుటుంబాలకు ఇండ్ల పట్టాలు మంజూరయ్యాయని, కానీ ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు పట్టాలు జాప్యం చేస్తున్నందుకు కలెక్టర్ ను కలసి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ స్పందించలేదన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టరేట్ ముట్టడి చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. మేడారంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, వారికి సహకరించే విధంగా అధికారులను బదిలీలు చేస్తున్నారన్నారు. నిత్యం వేలాది భక్తులు తరలివచ్చే మేడారం లో ఇంచార్జి ఎమ్మార్వోలు ఉంటే ఎలా అని ప్రశ్నించారు.అలాగే చల్పాక గ్రామంలో ఆదివాసుల గుడిసెలను తొలగించిన ఫారెస్ట్ అధికారుల చర్యను ఆమె తీవ్రంగా ఖండించారు. ఆదివాసులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, లేకపోతే కలెక్టరేట్ ముందు భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు దండగుల మల్లయ్య, పార్టీ సీనియర్ నాయకులు దిడ్డి మోహన్ రావు, నుశెట్టి రమేష్, పోగు నగేష్, ఇంద్రారపు లాలయ్య, సాయిని లక్ష్మీనర్సు, బందెల తిరుపతి, దొనకే తిరుపతి, గ్రామ అధ్యక్షుడు రంగు సత్యం, ఎండి రఫిక్, గండు బిక్షపతి, జాదు చంద్రం, మాజీ సర్పంచి గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు.