ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు
తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని నార్లాపూర్ గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో తీవ్రమైన అవకతవకలు జరిగాయని స్థానిక యువజన సంఘం ఆరోపించింది. ఇల్లు లేని అసలైన పేదలకు కాకుండా, కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలకు ఇండ్లు కేటాయించారని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన నార్లాపూర్ శ్రీరామ్ యూత్ అధ్యక్షుడు రాధారపు కిరణ్ మాట్లాడుతూ, “ఇండ్లు లేని వారు ఆశతో ఎదురుచూస్తుంటే, ఇప్పటికే ఇండ్లు ఉన్నవారికి మళ్లీ ఇల్లు రావడం ఎంతవరకు న్యాయమో” అని ప్రశ్నించారు. అధికారులు గ్రామానికి వచ్చి స్వయంగా సర్వే చేసి, నిబంధనల ప్రకారం అసలైన అర్హులకు ఇండ్లు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. గ్రామంలో ఇప్పటికీ అనేకమంది కుటుంబాలు శిథిలమైన గృహాల్లో నివాసం ఉంటూ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యువజన సంఘం పేర్కొంది. ఇండ్లు లేని వారికి ఈ పథకం ఆశగా మారిందని, వారికి న్యాయం జరిగేలా జిల్లా కలెక్టర్ తక్షణమే సర్వే చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు సుర్కంటి రాము, చింతల శ్యామ్, సమ్మయ్య, సంకె ప్రణయ్, మొక్క నరేష్ తదితరులు పాల్గొన్నారు.