రెవెన్యూ సదస్సులో దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
– జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
కాటారం, తెలంగాణ జ్యోతి : భూభారతి లో భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మంగళవారం భూపాలపల్లి మండలం, వజినేపల్లి గ్రామంలో జరుగుతున్న భూ భారతి రెవెన్యూ సదస్సును ఆకస్మిక తనిఖీ చేసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టంపై ఏప్రిల్ మాసంలో అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించామని తెలిపారు. అనంతరం రేగొండ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు గా ఎంపిక చేసి అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుండి విజ్ఞాపనలు, సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ నెల 3వ తేదీ 20వ తేది వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తు న్నామని ప్రజలు ఇచ్చిన ప్రతి దరఖాస్తు రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆదేశించారు. వచ్చిన దరఖాస్తు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి పట్టాలు జారీ చేస్తామని తెలిపారు. ప్రజలు రెవెన్యూ సదస్సులలో తమ భూ సమస్యలపై దరఖాస్తు ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా సదస్సుకు వచ్చిన ప్రజల భూములకు సంబంధించిన సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గిర్దావర్ రామస్వామి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భూ భారతి సహాయక కేంద్రం పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూ భారతి సహాయక కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం పరిశీలించారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో సిబ్బంది పని తీరును, ప్రజలకు అందుతున్న సేవలను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 3వ తేది నుండి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు భూ సంబంధిత సమస్యలు వేగంగా పరిష్కారానికి భూ భారతి రెవెన్యూ సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజల నుండి వచ్చిన అభ్యర్థనలను సమయానికి పరిశీలించి, సంబంధిత తహసీల్దార్ కు సిఫారసు చేసి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తు లు నిష్పక్షపాతంగా పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. కేంద్రంలో నమోదు అయిన ఫిర్యాదులు, వాటి పరిష్కార స్థితిని కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందికి సూచనలు చేసి వచ్చిన దరఖాస్తును రిజిస్టర్ లో నమోదులు చేయాలని స్పష్టం చేశారు. కార్యాలయ పని వేళల్లో ప్రజలు సహాయక కేంద్రాన్ని సందర్శించి సలహాలు, సూచనలు పొందాలని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్లు హరిహర, శ్రీనివాస్, ఈడీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.