నిజాయతికి మరోపేరు అబ్దుల్ రెహమాన్
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : ఖమ్మం జిల్లాలో పుట్టిన అబ్దుల్ రెహమాన్ తల్లిదండ్రులు ఒక సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు. చిన్ననాటి నుండే సమాజంలో జరుగుతున్న కుల వివక్ష, వివేచనల పట్ల ఆయనకు తీవ్రమైన అసహనం ఉండేది. కులాల పేరుతో జరుగుతున్న భేదభావాలకు పూర్తిగా వ్యతిరేకంగా, సమానత కోసం ఆలోచించే వ్యక్తిగా ఎదిగారు.“చదువే సమాజంలో మార్పుకు దారి” అని నమ్మిన రెహమాన్ MSC, B.Ed వరకు చదివి, 2005లో అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. 2022లో రేంజర్‌గా పదోన్నతి పొందారు. 2024లో ఏటూరునాగారం సౌత్ రేంజ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించి, తన విధుల్లో నిజాయితీకి మారుపేరు అయ్యారు. అడవిలో ఏ రకమైన అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటూ, యువతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్లాస్టిక్ నిషేధం పట్ల కట్టుదిట్టమైన ఆదేశాలు అమలు చేస్తూ, ఆదివాసీలను చైతన్యవంతులుగా మార్చడంలో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. తన జీతాన్ని ఖర్చుపెట్టి పేద విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, “విద్యే పేదల జీవితాల్లో వెలుగులు నింపే దివ్యశక్తి” అని విశ్వసిస్తూ, ఆశయంతో పని చేస్తూ, జీతం కోసం కాదు – సేవా ధర్మం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.