రాష్ట్రంలో 80 ఎకరాల్లో ఎకో టౌన్ కు
– జపాన్ “కితాక్యూషూ సిటీ” స్ఫూర్తితో అభివృద్ధి
– ఏడాదిన్నరలో తెలంగాణకు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు
– రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
కాటారం,తెలంగాణజ్యోతి : భావితరాల అవసరాలకు అనుగు ణంగా సుస్థిరాభివృద్దే లక్ష్యంగా జపాన్ లోని “కితాక్యూషూ సిటీ” స్ఫూర్తితో రాష్ట్రంలో 80 ఎకరాల్లో ఎకో టౌన్ ను అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. తెలంగాణ, కితాక్యూషూ నగరం మధ్య కుదిరిన పరస్పర సహకార ఒప్పందం ఇందుకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. సోమవారం టీహబ్ లో “ఫ్రం కితాక్యూషూ టూ తెలంగాణ కేటలైసింగ్ సస్టైనబుల్ ఇండస్ట్రియల్ గ్రోత్ (From Kitakyushu to Telangana: Catalysing Sustainable Industrial Growth)” అనే అంశంపై సోమవారం రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. “తెలంగాణ రైజింగ్ 2047” అనే లక్ష్యంతో అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్ గా మార్చాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంకల్పమన్నారు. ఏడాదిన్నరలో రాష్ట్రానికి సుమారు రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేందుకు మా ప్రభుత్వం కృషి చేసిందన్నారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి అనేక అంతర్జాతీయ స్థాయి కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా యన్నారు. రాష్ట్రంలో జపాన్ కంపెనీలు మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇప్పటికే తెలంగాణకు చెందిన 50 మంది యువతకు జపాన్ లో ఉపాధి అవకాశాలు లభించాయని, మరింత మందికి దక్కేలా టాంకాం లాంటి ప్రభుత్వ సంస్థల ద్వారా జపనీస్ భాషను నేర్పిస్తామ న్నారు. రాబోయే రోజుల్లో నెట్ జీరో లక్ష్యాలు, రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్, సర్క్యులర్ ఎకానమీ, క్లీన్ టెక్నాలజీస్, డిజిటల్ ఇన్నోవేషన్ తదితర అంశాల్లో కితాక్యూషూ నగరంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్ సిటీని పర్యావరణహితంగా తీర్చి దిద్దేందుకు ఇండస్ట్రియల్ జోన్స్ ఏర్పాటు, జీరో వేస్ట్ డిజైన్, అత్యాధునిక వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ పద్ధతులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెలంగాణ, కితాక్యూషూ నగరం మధ్య సత్సంబంధాలు మరింత పెరిగేలా హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసులను నడిపేందుకు గల సాధ్య సాధ్యాలపై అధ్యయనం చేయిస్తామ న్నారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూల తలను వివరించి, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా జపాన్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, కితాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచీ, టీజీఐఐసీ ఎండీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, టీజీఐఐసీ సీఈవో మధుసూదన్, రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సెల్ డైరెక్టర్ అవినాష్, సీఐఐ తెలంగాణ ఛైర్మన్ శివ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.