తాగేది శుద్ధ జలమేన..!
తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం : పేరుకే ఫిల్టర్ వాటర్ అని చెప్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించక పోవడంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆరోపిస్తున్నారు. కన్నాయి గూడెం మండల వ్యాప్తంగా గ్రామాల్లో వాటర్ ప్లాంట్ల ద్వారా తాగునీటి విక్రయాలు జరుగుతున్నాయి. తాగునీటి బోర్లు, మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న నీటిని చాలా వరకు తాగడం లేదు. ఎక్కువగా వాటర్ ప్లాంట్లలో తయారయ్యే నీళ్లనే తాగుతున్నారు. నదుల ద్వారా వచ్చే నీటిని శుభ్రం చేసిన నీరు తాగడానికి ప్రజలు ఇష్టపడటం లేదు. దీంతో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి నీటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని కన్నాయి గూడెం మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.
నిర్వహణన సరిగానే ఉందా
మండలంలో ప్రజల తాగునీటి వినియోగం అధికంగా ఉండటం తో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు అధికంగా రసాయనాలను కలుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. రివర్స్ ఆస్మోసిస్ (ఆర్వో) పద్దతిలో నీటిని ఫిల్టర్ చేయాలంటే అర్హులైన టెక్నీషియన్ ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఏ ప్లాంటులలో కూడా టెక్నీషియన్లు ఉండకుండా నిర్వాహకులే నడుపుతున్నారు. ఆర్వో ప్లాంట్ల నిర్వాహకులకు ఏ విధమైన లవణ మిశ్రమాలు ఎంతెంత మేరకు కలపాలనే విషయంపై కూడా వారికి స్పష్టత లేదు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వాటర్ ఫిల్టర్ల నీరు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నా అధికార యంత్రాంగం దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.