పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు
– శాంతియుత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలి
– అదనపు కలెక్టర్ మహేందర్ జి
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : జూన్ 3 నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారు లు సమిష్టిగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్ జి ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్ నుండి టెలికాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణలో ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా, సమర్ధవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జూన్ 3 నుండి 13వ తేదీ వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్టు 74 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించ రాదని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ 144 సెక్షన్ అమలు చేసి, పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. కేంద్రాల సమీపంలోని జిరాక్స్ షాపులను తాత్కాలికంగా మూసివేయాలని సూచించారు. వైద్య సౌకర్యాల దృష్ట్యా, పరీక్ష కేంద్రాల్లో ఏఎన్ఎంలు, అత్యవసర మందులతో కూడిన వైద్య సిబ్బందిని నియమించాలని సూచించారు. అలాగే ఫర్నిచర్, త్రాగునీరు, విద్యుత్, ఫ్యాన్‌లు, టాయిలెట్లు వంటి సదుపా యాలను సమృద్ధిగా కల్పించాలని సంబంధిత శాఖలకు సూచించారు. విద్యార్థుల రాకపోకల దృష్ట్యా అవసరమైన బస్సులను పరీక్ష సమయానుకూలంగా నడిపించాలన్నారు. పరీక్షల నిర్వహణలో మాస్ కాపీయింగ్‌కి తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీఈఓ పాణి, డిఎంహెచ్ గోపాల్ రావు, ఆర్టీసీ డిపో మేనేజర్ జ్యోత్స్న, ప్రభుత్వ పరీక్షల సహాయ నియంత్రణాధికారి అప్పని జయదేవ్ తదితర అధికారులు పాల్గొన్నారు.