Indiramma amrutham | తెలంగాణలో మరో కొత్త పథకం
– కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృతం
– ఆడపిల్లలకు శక్తినిద్దాం.. ఆరోగ్య తెలంగాణ ను నిర్మిద్దాం అన్న నినాదంతో సరికొత్త పథకం
హైదరాబాద్, తెలంగాణ జ్యోతి : తెలంగాణలోని 14 నుంచి 18 ఏళ్ల వయసుగల అమ్మాయిలకి అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రతి రోజు ఒక చిక్కి, చిరుధాన్యాల పట్టీలను కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృతం పేరిట ప్రభుత్వం అందించనుంది. తొలుత ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్టు కింద) భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అమలు చేయనున్నా రు. భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెంలో నేడు మంత్రి సీతక్క ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. పథకంలో భాగంగా ప్రతిరోజూ ఒకటి చొప్పున నెల రోజులకు 30 చిక్కీలు ఇస్తారు. ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున రెండుసార్లు వీటిని పంపిణీ చేస్తారు. ఒక్కో చిక్కీలో సుమారు 600 కేలరీలు, 18-20 గ్రాము ప్రొటీన్లతో పాటు అవసరమైన సూక్ష్మ పోషకాలు ఉంటాయి. పోషకాహారం అందించడమే కాకుండా ఆరోగ్య సంరక్షణ, స్వీయ భద్రతపై అవగాహనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ పథకం కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23,399 మందికి, కుమురం భీం ఆసిఫాబాద్లో 18,230 మందికి, జయశంకర్ భూపాలపల్లిలో 8,640 మంది బాలికలకు ప్రయోజనం చేకూర్చనున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం తెలంగాణలో 64.7 శాతం బాలికలు రక్తహీనతతో బాధపడు తున్నారు. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది.