టీచర్లు సామాజిక బాధ్యతలో భాగస్వాములు కావాలి
– జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్
కాటారం, తెలంగాణజ్యోతి : ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత గుర్తెరిగి సమాజ భాగస్వాములై మానవ అక్రమ రవాణా అరికట్టడంలో తమ వంతు పాత్ర వహించి ప్రజలను చైతన్య పరచాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అన్నారు. మంగళవారం భూపాలపల్లి, ములుగు జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులకు మానవ అక్రమ రవాణాపై రెండు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి యం.రాజేందర్ పాల్గొన్నా రు. శిక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు మనుషుల అక్రమ రవాణా నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వామి అయినప్పుడే దీనిని సమూలంగా నివారించవచ్చునని అన్నారు. సైబర్ ట్రాఫికింగ్ లో భాగంగా ప్రతి గ్రామంలో సమాజ జాగృతి సంఘాలను ఏర్పాటు చేసి వారి ద్వారా అక్రమ రవాణా సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించాలని ప్రతి ఒక్కరు ఈ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మానవ అక్రమ రవాణా జరుగుతుందని భావించిన సందర్భంలో టోల్ ఫ్రీ నెంబర్స్ 1098, 100, 181, 1930 సైబర్ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయలన్నారు. ఈ కార్యక్రమంలో బాలిక శిశు అభివృద్ధి అధికారిణి వి శైలజ, క్వాలిటీ కోఆర్డినేటర్ కాగిత లక్ష్మణ్, ప్రజల స్వచ్ఛంద సంస్థ రిసోర్స్ పర్సన్లు శ్రీకాంత్, సుప్రియ,పాఠశాలల ఉపాధ్యాయులు 62 మంది పాల్గొన్నారు.