ఐసిడిఎస్ వెంకటాపురం సూపర్వైజర్, డి.డబ్ల్యు.ఓ పై క్షేత్ర స్థాయి విచారణ జరపాలి
– ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ సతీష్
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల శివారు శాంతి నగర్ గ్రామంలో శనివారం ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల అధ్యక్షులు తుర్స కృష్ణ బాబు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ మాట్లాడుతూ ఐసిడిఎస్ వెంకటాపురం సిడిపిఓ ధనలక్ష్మి చెయ్యి కోసుకొని ఆత్మహత్యా యత్నం చేసుకొని రోజులు గడుస్తున్నా సూపర్వైజర్, డి డబ్ల్యు ఓ ల పై క్షేత్ర స్థాయి లో జిల్లా కలెక్టర్ విచారణ జరపాలని అన్నారు. ఉన్నతాధికారులు విచారణ కు పంపిస్తే విచారణ చేసే అధికారులు, గుట్టు చప్పుడు కాకుండా వారికి నచ్చిన వారితో సమావేశం ఏర్పాటు చేసుకొని వెళ్ళిపోయినట్లు తెలుస్తుందని ఆరోపించారు. అంతే తప్ప కారకులైన అధికారులపై ఎటువంటి వేటు వేయకపోవడం బాధాకర మన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన జిల్లా అధికారి సూపర్వైజర్ కొందరి అంగన్వాడి టీచర్ల వల్లే ఆమె ఆత్మ హత్య ప్రయత్నం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, వారిని విధుల నుండి తొలగించాలని కోరారు. వెంకటాపురం ప్రాజెక్టు కార్యాలయం పరిధిలో అంగన్వాడి సిబ్బందిపై క్షేత్రస్థాయిలో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఐసిడిఎస్ పథకం కింద అనుబంధ పోషకాహారం, ప్రీ స్కూల్ విద్య, పోషకా హారం, ఆరోగ్య విద్య, రోగ నిరోధకత, ఆరోగ్య తనిఖీ, రెఫరల్ సేవలు, 0-6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు గర్భిణీ స్త్రీలకు, మరియు పాలిచ్చే తల్లులకు ఐసిడిఎస్ పథకం కింద సేవలను సక్రమంగా అందించాలని కోరారు. వెంకటాపురం, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి కేంద్రాలలో విధి విధానాలపై పర్యవేక్షణ, బిల్లులపై క్షేత్రస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల అధ్యక్షులు తుర్స కృష్ణ బాబు, ఉపాధ్యక్షులు తాటి రాంబాబు, పూనెం అర్జున్, తాటి నాగరాజు, బొగ్గుల రాజ్ కుమార్, మడకం రమేష్, మడకం దేవి కుమారి, మడకం కృష్ణవేణి, దీపిక తదితరులు పాల్గొన్నారు.