గారెపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం 

Written by telangana jyothi

Published on:

గారెపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం 

ఇసుక లారీ ఢీ: ఒకరికి రెండు కాళ్లు నుజ్జు నుజ్జు 

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రమైన గారేపల్లి అంబేద్కర్ కూడలిలో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరికి రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి కాటారం పోలీస్ ఎస్ఐ అభినవ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంగా… కాటారం గ్రామ పంచాయతీ పరిధిలోని సబ్ స్టేషన్ పల్లె గ్రామానికి చెందిన తోట రవి అనే వ్యక్తి నిత్యవసర పనుల మీద గురువారం మధ్యాహ్నం గారేపల్లి అంబేద్కర్ కూడలి వద్ద కు వచ్చి తన బైక్ పై ఇంటికి వెళుతుండగా దుర్ఘటన జరిగిందని వివరించారు. కాలేశ్వరం నుంచి హైదరాబాదుకు ఇసుక లోడుతో వెళుతున్న లారీ ఢీకొనడంతో తోట రవి రెండు కాళ్లు టైర్ల కింద పడి నుజ్జు నుజ్జు అయ్యాయని పేర్కొన్నారు. గారేపల్లి కూడలి లో బీభత్సంగా అతి భయంకరంగా జరిగిన ఈ దుర్ఘటన పట్ల స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రజా సంఘాలు, అఖిలపక్షం ఆధ్వర్యంలో హుటాహుటిన అంబేద్కర్ కూడలి వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కుటుంబ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సంఘీభావంగా ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఇసుక లారీల రవాణా పట్ల నాయకులు భగ్గుమన్నారు. ఈ ప్రాంతం నుంచి పట్టణాలకు తరలి వెళుతున్న ఇసుక లారీల రవాణా తో ఎంతో మందిని వాహనాలు బలిగొన్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో గారేపల్లి కూడలిలో మహాదేవపూర్, మంథని, భూపాలపల్లి మూడు దిక్కులలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, బొగ్గు టిప్పర్లు, ఇసుక లారీలు, ఆటోలు, కార్లు ఇతర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గంటల తరబడి ఎండను సైతం లెక్కచేయకుండా మానవతామూర్తులు, అఖిలపక్షం నాయ కులు నిరసన తెలియజేశారు. విషయం తెలుసుకున్న కాటారం ఎస్ ఐ అభినవ్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆందోళనకారులతో చర్చించారు. బాధితుడికి న్యాయం జరిగే విధంగా చూస్తామని ఎస్ఐ హామీ ఇచ్చినప్పటికీ ధర్నా, రాస్తారోకోను కొనసాగించారు. తమకు జిల్లా కేంద్రం నుంచి టీఎస్ఎమ్ఐడిసి శాఖ అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానికంగా జరుగుతున్న సంఘటన విషయాలను ఎస్సై ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్, జిల్లా టిఎస్ఎమ్ఐడిసి అధికారులతో చరవాణిలో తెలియజేశారు. కాగా జిల్లా కేంద్రం నుంచి వెంటనే సంబంధిత శాఖ ప్రతినిధి గారెపల్లి కి చేరుకొని ఎస్సై సమక్షంలో బాధితుడికి నష్టపరిహారం అందించే విధంగా చర్యలు చేపడతామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో అఖిలపక్షం నేతలు ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జక్కు రాకేశ్,పార్టీ కాటారం మండలం ఇంచార్జ్ జోడు శ్రీనివాస్ యూత్ అధ్యక్షులు రామిల్ల కిరణ్ చీమల వంశీ ఊర వెంకటేశ్వరరావు ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీకాంత్ బొడ్డు స్మరణ తదితరులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా తీవ్ర గాయాల పాలైన తోట రవి ని హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ప్రధాన ఆసుపత్రికి తరలించారు. తోట రవి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు, బంధువులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తోట రవి ఆరోగ్యం కుదుటపడేందుకు మానవతామూర్తులు పెద్ద ఎత్తున దాతృత్వం విరాళాలు అందిం చాలని సామాజిక సేవా కార్యకర్త, కాంగ్రెస్ నేత చీమల రాజు సోషల్ మీడియా వేదికగా పిలుపు నివ్వడంతో, పలువురికి తోచిన మేరకు ఆర్థిక సహాయాన్ని అందించారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now