కుంగిపోయిన రాళ్లవాగు వంతెన
– స్తంభించిన రాకపోకలు
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి : వెంకటాపురం టు చెర్ల భద్రాచలం ప్రధాన రహదారి 65 కిలోమీటర్ వద్ద రాళ్ల వాగుపై నిర్మించిన వంతెన,గురువారం రాత్రి కృంగిపోవటంతో రాత్రి నుండి పోలీసులు రాకపోకలను నిలిపివేశారు. దీంతో వెంకటాపురం భద్రాచలం చర్ల రాకపోకలు స్తంభించిపోయాయి. 1981-82 సంవత్సరం నిర్మించిన ఈ వంతెన పై అధిక లోడ్లతో వెళుతున్న ఇసుక లారీల కారణంగా కుంగిపోయినట్లు సమా చారం. సమాచారం తెలిసిన వెంటనే వెంకటాపురం పోలీసులు, రోడ్లు భవనాలు శాఖ అధికారులు, వంతెన వద్ద రాకపోకలను నిలిపివేసి బారికేడ్లను అడ్డంగా పెట్టారు. అయితే వంతెన పై నుండి మోటార్ సైకిళ్ళు, ఆటోలు, చిన్నకారులు మాత్రమే తాత్కాలికంగా అనుమతిస్తున్నట్లు సమాచారం. భారీ వాహనా లను సైతం నిలిపివేశారు. దీంతో భద్రాచలం వెంకటాపురం చర్ల ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు స్తంభించిపోయాయి. రాష్ట్రీయ రహదారి నెంబర్ 12 దారిలో 19 80 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం భద్రాచలం నుండి వాజేడు మండలం వరకు వాగులపై వంతెనలు నిర్మాణం చేశారు. కుంగిపోయిన రాళ్లవాగు వంతెన పక్కనుండి డైవర్షన్ రోడ్డు వేసేందుకు తగిన ప్రతిపాదనలతో రోడ్ల భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులు వంతెన వద్దకు మధ్యాహ్నం లోగా చేరుకునే అవకాశం ఉందని సమాచారం. కుంగిపోయిన వంతెన పక్క నుండి డైవర్షన్ రోడ్డు వేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.