జూనియర్ కళాశాల తరగతి గదుల ఏర్పాట్లు పరిశీలన
– మండల ప్రత్యేక అధికారి లెనీనా
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ జూనియర్ కళాశాల తరగతి గదుల ఏర్పాట్లపై ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకుగురువారం మండల ప్రత్యేక అధికారి లెనీనా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని కళాశాల కార్యాలయాన్ని పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం అత్యవసరంగా జూనియర్ కళాశాల తరగతుల నిర్వహణ కోసం అనువైన ప్రదేశాలను ఆమె పరిశీలించినట్లు తెలిపారు. అనంతరం ఉన్నత పాఠశాలలో నిర్మాణంలో ఉన్న నూతన భవనం, బీసీ మర్రిగూడెంలోని పాలెంవాగు ప్రాజెక్టు క్వార్టర్స్, దసలి పట్టు పరిశ్రమ భవనం ను ఆమె సందర్శించి ఆయా వివరాలను కలెక్టర్ కి చరవాణి ద్వారా అక్కడికక్కడే తెలియజేశారు. నూతన కళాశాలకి అనువైన తరగతి గదులను, రాబోయే పరీక్షల నిర్వహణను కూడా దృష్టిలో పెట్టుకొని, అన్ని విధాల సౌకర్యంగా ఉండే ఏర్పాట్లు చేస్తామని ఆమె అన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అందుబాటులో ఉండే విధంగా కళాశాల నిర్వహణ జరుగుతుందని ఆమె ఈ సందర్భంగా అన్నారు. వెంకటాపురం నూతన కళాశాలలో ఈ విద్యా సంవత్సరం లో అతి స్వల్ప వ్యవధిలోనే 50 అడ్మిషన్లు రావడం సంతోష కరంగా వుందని అకాడమిక్ ఇంచార్జ్ డా. అమ్మిన శ్రీనివాస రాజు ఆనందం వ్యక్త పరిచారు. మండల కేంద్రంలో అందు బాటులో ప్రభుత్వ కళాశాల రావడంతో గతంలో భద్రాచలం, కొత్తగూడెం, హనుమకొండ,వరంగల్ వంటి దూర ప్రాంతాల్లో చేరిన విద్యార్థులంతా ఇక్కడి కళాశాలలో తిరిగి చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్ర మంలో ములుగు జిల్లా ఇంటర్ విద్యాధికారి పుల్లకాండ వెంకటేశ్వర్లు, కళాశాల అకాడమిక్ ఇంచార్జ్ డా: అమ్మిన శ్రీనివాసరాజు, మండల అభివృద్ధి అధికారి జి. రాజేంద్ర ప్రసాద్, పంచాయతీ అధికారి ఆర్. హనుమంతరావు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొంది వీరవెంకట సత్యనారా యణ, పంచాయతీ సెక్రెటరీ జి. ప్రవీణ్, కళాశాల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.