వెంకటాపురం మండలానికి 4 ప్రాథమిక పాఠశాలలు మంజూరు
వెంకటాపురం, జూలై 6, తెలంగాణ జ్యోతి : పాఠశాలలేమి వల్ల విద్యకు దూరంగా ఉన్న గిరిజన గ్రామాలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 4 కొత్త ప్రాథమిక పాఠశాలలు మంజూరయ్యాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మండలం లోని శాంతినగర్, యోగితానగర్, మొట్లగూడెం, యాకన్నగూడెం గ్రామాలలో మంజూరైనట్లు మండల విద్యాధికారి జీవివి సత్యనారాయణ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా ప్రాథమిక హక్కు చట్టం ప్రకారం 20 మంది విద్యార్థుల బడివయస్సు ఉన్న ప్రతీ గ్రామంలో పాఠశాల ఉండాల్సిందేనన్న ప్రభుత్వ విధానాన్ని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వెంకటాపురం మండలంలో ఉన్న 45 ఎంపీపీ ఎస్, యుపిఎస్ పాఠశాలలతో పాటు, ఈ నాలుగు కొత్త పాఠశాలలు కలిపి మొత్తం 49 ప్రాథమిక పాఠశాలలు సేవలు అందించనున్నాయన్నారు. సోమవారం నుంచి ఈ పాఠశాలలు పాఠ్యోపాధ్యాయ కార్యకలా పాలు ప్రారంభించనున్నాయి. పాఠశాలల కోసం ప్రత్యేక భవనాలు లేకపోతే, స్థానిక ప్రభుత్వ భవనాలు, అంగన్‌వాడి కేంద్రాలు, సమీపంలోని ఉపాధ్యాయుల డిప్యూటేషన్ ద్వారా తరగతులు నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. శాంతినగర్ గ్రామస్థులు ఇప్పటికే శ్రమదానంతో పాఠశాలకు షెడ్ నిర్మించారు. స్థానికులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ తమ పిల్లల విద్యకు ఇది గొప్ప అవకాశమని అభిప్రాయ పడుతు న్నారు. పాఠశాలల ఏర్పాటుకు మౌలిక సదుపాయాల కల్పన కోసం గ్రామస్థులు సన్నాహాలు ప్రారంభించారు.