వ్యవసాయ భూముల్లో మొక్కలు నాటవద్దు
– మా జీవనాధారం కాపాడండి
– మంత్రి సీతక్కను కోరిన చిన్నబోయినపల్లి రైతులు
ఏటూరునాగారం, జూలై30, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామ శివారులో గత 35 సంవత్సరాలుగా పంటలు పండిస్తూ జీవనం కొనసాగిస్తున్న రైతుల వ్యవసాయ భూముల్లో తమ అనుమతి లేకుండానే అటవీశాఖ అధికారులు మొక్కలు నాటే ప్రయత్నం చేస్తున్నారని, ఈ చర్యను తక్షణమే నిలిపివేయాలని గ్రామస్తులు మంత్రి సీతక్కను కోరారు. ఇప్పటికే కలెక్టర్ టీఎస్ దివాకర్ నేతృత్వంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించి మొక్కలు నాటే అంశాన్ని చర్చించినా, రైతులుతాము అంగీకరించబోమని స్పష్టంగా చెప్పిన విషయాన్ని వారు గుర్తు చేశారు. అయినప్పటికీ అటవీశాఖ అధికారులు వారిని భయపెట్టి మొక్కలు నాటాలని యత్నించడం వల్ల తమ భూములపై హక్కు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వనవృద్ధి పేరిట తమ జీవనాధారమైన భూముల పై హక్కును కాపాడేందుకు తక్షణమే మొక్కల నాటకం ఆపివేసి, పంటలు సాగు చేసుకునేలా సహకరించాలని మంత్రి సీతక్కను రైతులు వేడుకుంటున్నారు.