నూతన అసెంబ్లీ నియోజకవర్గంగా నూగూరు వెంకటాపురం ఏర్పాటు చేయాలి
– ప్రభుత్వం దృష్టి సారించాలి
– నేతకాని సంక్షేమ సంఘం డిమాండ్
వెంకటాపురం, జులై 1,తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో అభివృద్ధిలో వెనుకబడిన నూగూరు వెంకటాపురం మండల కేంద్రాన్ని భవిష్యత్తులో ఏర్పడబోయే నూతన అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటిగా ప్రకటించాలని తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడి ఈశ్వర్ నేతకాని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ… నూగూరు వెంకటాపురం మండలం ఇటు భద్రాచలం, అటు ములుగు అసెంబ్లీ నియోజకవర్గాల మధ్యలో ఉన్నప్పటికీ, అన్నివిధాల అభివృద్ధి నుంచి దూరంగా పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆధారిత పథకాలు, నిధులు సరైన స్థాయిలో రాకపోవడంతో ప్రాంతీయ వెనుకత్వం తీవ్రమైందన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజక వర్గ పునర్విభజనలో వెంకటాపురాన్ని ప్రత్యేక నియోజకవర్గంగా ప్రకటించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. ఇందుకోసం మండలంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి తీర్మానం చేసి, ఏకగోప్యంగా తమ గళం వినిపించాలని పిలుపునిచ్చారు. అలాగే, వెంకటాపురం అభివృద్ధి కోసం ఈశ్వర్ నేతకాని వివిధ డిమాండ్లు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు: వెంకటాపురం మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ రోడ్ ఏర్పాటు,గురుకుల పాఠశాలలు ఏర్పాటు, అంబేద్కర్, కొమరం భీమ్ కమ్యూనిటీ భవనాల నిర్మాణం, దళిత, గిరిజన యువతకు ఉపాధి కల్పించే భారీ పరిశ్రమలు స్థాపన, మండలంలోని ప్రతి గ్రామంలో పూర్తి స్థాయి సీసీ రోడ్లు, ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్‌రే, స్కానింగ్, బ్లడ్ టెస్ట్ వంటి అన్ని ఆరోగ్య సదుపాయాలు, గ్రంథాలయాలు, పాఠశాలల అభివృద్ధి వంటి అంశాలపై ప్రాధాన్యత వంటి అభివృద్ధి అంశాలను అమలు చేస్తేనే సమగ్రంగా వెంకటాపురం మండలం అభివృద్ధి చెందుతుందని, ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని ఆయన అన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నూతన అసెంబ్లీ నియోజకవర్గ ఏర్పాటు చేస్తే చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలకినట్లు అవుతుందన్నారు.