తపాలా సేవల్లో నూతన అధ్యాయం
– ములుగులో ప్రారంభం కానున్న ‘ఇండియా పోస్ట్ 2.0’
– జూలై 22 నుంచి అమలులోకి, తాత్కాలికంగా లావాదేవీలకు విరామం
ఏటూరునాగారం, జూలై17, తెలంగాణజ్యోతి:ములుగుజిల్లా లో తపాలా సేవలు మరింత ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నెల 22వ తేదీ నుంచి ‘ఇండియా పోస్ట్ 2.0’ సాంకేతికతను జిల్లాలోని అన్ని తపాలా కార్యాలయాల్లో అమలు చేయనున్నట్లు ములుగు పోస్టల్ ఇన్స్పెక్టర్ దయానంద్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని 6 సబ్ పోస్ట్ ఆఫీసులు, 85 బ్రాంచ్ పోస్టాఫీసుల్లో నూతన టెక్నాలజీ అమలవుతుందని పేర్కొన్నారు. ఈ పరికరాల ఏర్పాటు, సాంకేతిక సమీకరణ పనులు జూలై 18, 19 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కారణంగా జూలై 21వ తేదీ వరకు తపాలా సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు పేర్కొనడం జరిగింది. కొత్త వ్యవస్థతో గ్రామీణ ప్రజలకు వేగవంతమైన, సమర్ధవంతమైన సేవలు అందించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.