గోదావరి పరివాహక, ఫెర్రీ పాయింట్లపై ప్రత్యేక ఫోకస్…
– ప్రశాంత వాతవరణంలో ఎన్నికలు జరిగేలా పటిష్టమైన ప్రణాళిక
– స్వేచ్చాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేల కార్యాచరణ
– జిల్లాకు చేసుకున్న 10 కంపెనీల సీ ఆర్ పీ ఎఫ్ బలగాలు
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్ట్ ప్రభావిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడంతో పాటు, ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, స్వేచ్ఛాయుత వాతవరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి శ్రీ కిరణ్ ఖరే ఐపీఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా పోలీసులతో పాటు, దాదాపు 1000 మంది కేంద్ర సాయుధ బలగాలు, ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర పోలీసుల సేవలను ఎన్నికల్లో వినియోగిస్తున్నామని ఎస్పి పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా లోని ప్రతి ప్రాంతాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని, ముఖ్యంగా మావోయిస్టులు జిల్లాలోకి ప్రవేశించకుండా గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు , ఫెర్రీ పాయిట్ల వద్ద గట్టి భద్రతా చర్యలు చేపట్టామని ఎస్పి తెలిపారు. అలాగే సరిహద్దు రాష్ట్రాల యిన మహారాష్ట్ర, చత్తీస్గడ్ పోలీసులతో సమన్వయంతో పని చేస్తున్నామని ఎస్పి తెలిపారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణను ఎవరూ అడ్డుకున్న కఠిన చర్యలు తప్పవని ఎస్పి హెచ్చరించారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించామని, జిల్లా పరిధిలో భద్రతా పరంగా పటిష్ట చర్యలు చేపట్టామని ఎస్పి కిరణ్ ఖరే వెల్లడించారు.