అంగరంగ వైభవంగా శరన్నవరాత్రుల ముగింపు
- భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఊరేగింపు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవ రాత్రుల మహోత్సవాలు మంగళవారం ముగియటంతో, బుధవారం ఉత్సవ కమిటీలు సాయంత్రం అమ్మవారిని అంగరంగ వైభవంగా అలంకరణతో ఊరేగింపు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటాపురం పట్టణంలో ప్రధాన వీధులలో శరన్నవరాత్రుల ఉత్సవ కమిటీలు అమ్మ వారి ఊరేగింపు నిర్వహించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. మంగళవారం మంచి రోజు కాకపోవడంతో భక్తుల మనోభావాలతో బుధవారం అమ్మవార్ల విగ్రహాలను ఊరేగింపుగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కోలాటాలు భాజా భజంత్రీల తో రాత్రి పొద్దుపోయే వరకు ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవార్లను సమీపంలోని జలాశయాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి, జలాభిషేకాలతో సాగనంపారు. పాడిపంటలు సక్రమంగా పండాలని, అష్ట ఐశ్వర్యాలు కలిగి ఉండాలని ఈ సందర్భంగా అమ్మవారిని భక్తులు వేడుకున్నారు. వచ్చే ఏడాది మరల అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజా పురస్కారాలతో స్వాగతిస్తూ ఉత్సవాలు జరుపు కుంటామని, అందరినీ చల్లగా చూడాలని సకల జనులు సుఖశాంతులతో ఉండాలని ఈ సందర్భంగా భక్తులు కనకదుర్గమ్మ తల్లి ని వేడుకున్నారు.
1 thought on “అంగరంగ వైభవంగా శరన్నవరాత్రుల ముగింపు”