అంగరంగ వైభవంగా పసుపు దంచుట

అంగరంగ వైభవంగా పసుపు దంచుట

– పందిర్లపై పాలపొరక అలంకరణ

– సీతారాములకు ఎదురుకోళ్ల పూజలు

ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం పసుపు దంచుట కార్యక్రమం అంగరంగా వైభవంగా జరిగింది. ఈనెల 17వ తేదీన శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా కల్యాణ వేడుకల్లో భాగంగా గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున హాజరై పసుపుకొమ్ములను దంచి పసుపు, బియ్యంతో తలంబ్రాలను తయారు చేశారు. ఉదయం అడవి నుంచి పాలపొరకను తీసుకువచ్చి రామాలయంలో ఏర్పాటు చేసిన పచ్చని పందిరిపై కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు అలం కరించారు. అనంతరం నిత్యరాధణ, అభిషేకం, ఆరగింపు, పుణ్యహవ చనం, రక్షాబంధనం, అంకూర్పారణ హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. అలాగే భద్రాచలం నుంచి తీసుకువచ్చిన ముత్యాల తలంబ్రాలను మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం నుంచి మేళతాళాలతో నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరవేశారు. ఈ తలంబ్రాలను బుధవారం జరగబోయే కల్యాణవేడుకల్లో వినియోగించనున్నట్లు అర్చకులు యల్లాప్రగడ నాగేశ్వర్‌రావు శర్మ తెలి పారు.ఈ  కార్యక్రమంలో గ్రామ పెద్దలు పోగుల లక్ష్మీనారాయణ, వేణు గోపాల్‌ లాహోటీ, తాడూరి రఘు, కమిటీ సభ్యులు గాడిచర్ల సాంబయ్య, దీనంబంధుస్వామి, శ్రీను, బ్రహ్మం, సదానందం, శ్రీను, సంతోష్, ప్రసాద్, సంతోష్, రాజేష్, రమేష్, గడ్డం వినయ్‌ పాల్గొన్నారు.