జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు సాయి తేజ ఎంపిక 

జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు సాయి తేజ ఎంపిక 

వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : మండలంలోని లక్ష్మీదేవి పేట గ్రామానికి చెందిన గోగు సాయి తేజ జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న సాయి తేజ ఈనెల 14, 15, 16 తేదీలలో నిర్మల్ లో జరిగిన రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీలలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 ,2 తేదీలలో పంజాబ్ రాష్ట్రంలో జరిగే జాతీయస్థాయి పోటీలలో సాయి తేజ పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా సాయి తేజ మాట్లాడుతూ.. తాను క్రీడల్లో రాణించడానికి ఎల్లవేళలా ప్రోత్సహించిన పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ పిచ్చిరెడ్డి, పీడీ వెంకటరెడ్డి, పీ ఈ టీ పసరగొండ భాస్కర్, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ కట్ల సదయ్య, ఉపాధ్యాయులు సురేష్ బాబు, రామ్ రెడ్డి యాదగిరి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జాతీయస్థాయి పోటీలలో రాణించి వెంకటాపురం మండలానికి, చదివిన పాఠశాలకు మంచిపేరు తీసుకువస్తానన్నారు. కాగా సాయి తేజ తండ్రి గోగు రాజయ్య సైతం గతంలో కబడ్డీలో జాతీయస్థాయి క్రీడాకారునిగా రాణించాడు. బాబాయ్ గోగు అన్వేష్ క్రికెట్లో జాతీయ క్రీడాకారుడిగా పలు క్రీడల్లో పాల్గొన్నారు. బేస్ బాల్ క్రీడలో రాణిస్తున్న సాయి తేజను పలువురు గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.