పార్లమెంటు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

పార్లమెంటు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

– జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే

తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి ప్రతినిధి : ఈనెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ కిరణ్ ఖారే జిల్లాలోని పోలీస్ అధికారులు సిబ్బందితో జిల్లా పోలీస్ కార్యాలయంనుంచి పోలీస్స్టేషన్ల వారిగా క్రిటికల్, ఎల్డబ్ల్యూ ఈ ప్రభావిత ప్రాంతాల పోలింగ్ స్టేషన్లలో తీసుకుంటు న్నటువంటి భద్రత చర్యల గురించి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ యస్.హెచ్.ఒ. లు తమ ఏరియాలో గల క్రిటికల్, మావో ప్రభావిత పోలింగ్ స్టేషన్ లను ప్రత్యేకంగా సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించాలని సూచించారు. గత ఎన్నికలలో అల్లర్లు సృష్టించిన వారిపై ప్రత్యేక నిఘా వుంచాలన్నారు. పోలింగ్ డే కు ముందు రోజు 48 గంటలపాటు తమ తమ ఏరియాలలో గల వైన్ షాప్స్, క్లోజ్ చేయించాలని, ఇంటింటి ప్రచారాలు, క్యాంపెనింగ్ వెహికల్స్ తిరగకుండా చూసుకోవాలని అన్నారు. ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగ్స్, ఫ్లెక్సీలు, బ్యానర్లు, లేకుండా చూసుకోవాలన్నారు. అదేవిధంగా ఓటు హక్కు లేని స్థానికేతరులు, ఎన్నికలు జరిగే నియోజకవర్గం లో ఉండడానికి వీలు లేదని, అందుకుగాను తమ ఏరియాలో గల లాడ్జీలను చెక్ చేయాలని సూచించారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికలను ప్రభావితం చేసే ఎలాంటివి కూడా అక్రమ రవాణా జరగకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖి చేయాలని ఎస్పి అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల బందోబస్తు కోసం వచ్చిన సిబ్బందికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని ఎస్.హెచ్.ఒ. లకు, సిఐలకు సూచించారు. అదేవిధంగా ఎన్నికల రోజు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మొబైల్ రూట్ లలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే క్షణాలలో లోకల్ ఎస్సై, సెక్టోరల్ అధికారి, రూట్ మొబైల్ టీమ్ లు అక్కడకు చేరుకొని సమస్యను పరిష్కరించగలగాలని అందుకు లోకల్ ఎస్సై, రూట్ మొబైల్ ఇంచార్జి, సెక్టొరల్ అధికారి కమ్యూనికేషన్ లో ఉంటూ కో ఆర్డినేషన్ చేసుకోవాలని తెలియజేశారు. ఆయా పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు, మొబైల్ రూట్ ఇంచార్జి లు సంబంధిత రూట్ సెక్టోరల్ అధికారి కంటాక్ట్ మొబైల్ నంబరు తప్పనిసరిగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు సంబందించి సమస్య తలెత్తితే ఎస్సై లు, నియోజకవర్గం వారిగా ఉన్న పోలీస్ నోడల్ అధికారికి తెలియజేయాలని అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో గల పోలింగ్ కేంద్రాలకు స్పెషల్ పార్టీతో పాటు గ్రీహౌండ్స్ దళాల ద్వారా ఏరియా డామినేషన్ నిర్వహించాలని తెలియజేశారు. ఆయా రూట్ లలో ఉన్న మొబైల్ పార్టీలు ఒకే చోట ఉండకుండా తమ రూట్ లలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలను అబ్జర్వ్ చేస్తు పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువ మంది గుమికూడకుండ చూసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు వచ్చి వెళ్లే దారిని క్లియర్ గా ఉండేలా చూసుకోవాలని తెలియజేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సౌకర్యాల కొరత ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎండాకాలంను దృష్టిలో ఉంచుకొని ఓటర్లు ఎక్కువగా ఉండే పోలింగ్ కేంద్రాలలో టెంట్లు, త్రాగునీటి సదుపాయం, ర్యాంప్ కూడ ఏర్పాటు చేయించాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని డీఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.