వింత పక్షి సంచారంతో స్థానికుల ఆసక్తి
వెంకటాపురం, అక్టోబర్ 16,తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలంలోని గుమ్మడి దొడ్డి, ఇప్పగూడెం అటవీ మరియు వ్యవసాయ ప్రాంతాల్లో ఒక వింత పక్షి దర్శనమిస్తూ ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. పావురం సైజులో ఉండే ఈ పక్షి, ఎరుపు కళ్లతో, నెమలి మాదిరి పురి విప్పుతూ, క్షణాల్లో ఎగిరిపోతుండడం విశేషం. స్థానికుల సమాచారం ప్రకారం, రాత్రివేళల్లో ఈ పక్షి మనుషుల గొంతు లాంటి శబ్దాలు చేస్తోందని చెబుతున్నారు. గురువారం ఉదయం గుమ్మడి దొడ్డి, ఇప్పగూడెం ప్రాంతాల్లో దుక్కులు దున్నుతున్న రైతులు ఈ వింత పక్షిని గమనించగా, కొంతమంది యువకులు దానిని తమ చరవాణిల్లో చిత్రీకరించారు. ఫోటోలు తీస్తుండగా పక్షి నెమలి లాగా పురి విప్పి వెంటనే ఎగిరి పోయిందని సాక్ష్యులు తెలిపారు. ఈ పక్షి ఏ జాతికి చెందినదో తెలుసుకునేందుకు అటవీ అధికారులు పరిశీలన చేపట్టనున్నారు.