జామాయిల్ లోడ్ ట్రాక్టర్ పట్టివేత
వెంకటాపురం, అక్టోబర్ 17, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం శివారులోని నూగూరు కంకలవాగు వంతెన సమీపంలో గురువారం రాత్రి ఫారెస్ట్ అధికారులు రవాణా పత్రాలు సరిగా లేని జామాయిల్ లోడ్ ట్రాక్టర్ ను పట్టుకున్నారు. సాక్షుల సమాచారం ప్రకారం.. ఓవర్ లోడ్ తో పాటు అతివేగంగా ఇతర వాహనాలపైకి దూసుకుపోతూ ఉన్న ట్రాక్టర్ పై ప్రజలు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం అధికారులు అక్కడికి చేరుకొని ట్రాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. తెలుసుకున్న వివరాల ప్రకారం, ఆలుబాక పంచాయతీ పరిధిలోని గ్రామం నుండి భద్రాచలం సారపాక ఐటిసి పేపర్ మిల్లుకు జామాయిల్ కలపను రవాణా చేస్తున్నట్లు తెలిసింది. అయితే, రవాణా పత్రాలలో రైతు పట్టా భూమి వివరాలు, సర్వే నంబరు తదితర ముఖ్యమైన వివరాలు లేకపోవడంతో అధికారులు ట్రాక్టర్ను వెరిఫికేషన్ కోసం వెంకటాపురం ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. రవాణా పత్రాల పరిశీలన అనంతరం ట్రాక్టర్ విడుదలపై నిర్ణయం తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.