గోదావరి ఇసుక క్వారీల నిర్వహణకు గ్రామసభల ఆమోదం
వెంకటాపురం నూగూరు, అక్టోబర్ 15, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మొర్రవాణిగూడెం, అబ్బాయిగూడెం మరియు ఒంటిచింతగూడెం గ్రామాలకు సంబంధించిన గోదావరి ఇసుక క్వారీల నిర్వహణ కోసం బుధవారం ఆయా గ్రామాలలో పీఈఎస్ఏ గ్రామసభలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో సొసైటీల ఎంపికపై గ్రామ సభలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. మొర్రవాణిగూడెం క్వారీకి కొమరం భీమ్ సొసైటీ, అబ్బాయిగూడెం క్వారీకి శ్రీ లక్ష్మీదేవి సొసైటీ, ఎదిర పరిధిలోని ఒంటిచింతగూడెం క్వారీకి ముత్యాలమ్మ సొసైటీలను గ్రామ సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. మొర్రవాణిగూడెం గ్రామంలో 214 మంది గిరిజన ఓటర్లలో 134 మంది, అబ్బాయిగూడెం గ్రామంలో 214 మందిలో 126 మంది, ఒంటి చింతగూడెంలో 58 మంది ఓటర్లంతా హాజరై ఒకే స్వరంతో తమ ఆమోదం తెలిపారు. ఈ గ్రామసభల్లో వెంకటాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి పొదిల శ్రీనివాస్, పీఈఎస్ఏ జిల్లా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్, మండల పంచాయతీ అధికారి ప్రవీణ్ కుమార్, అలాగే ఆయా పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.