ములుగు మెడికల్ కాలేజీలో ఫస్ట్ అడ్మీషన్
ములుగు మెడికల్ కాలేజీలో ఫస్ట్ అడ్మీషన్
– జాయిన్ అయిన రాజస్థాన్ కు చెందిన గౌరీ
– అభినందించిన మంత్రి సీతక్క
– మొత్తం 50 సీట్లలో ఆలిండియా స్థాయిలో ఏడు సీట్లు భర్తీ
ములుగు ప్రతినిధి : ములుగులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో ఆలిండియా ర్యాంక్ సాధించిన రాజస్థాన్ రాష్ట్రం గంగానగర్ జిల్లాకు చెందిన విద్యార్థిని గౌరీ మొదటి అడ్మీషన్ తీసుకుంది. బుధవారం స్థానిక ఏరియా ఆస్పత్రిలోని ప్రిన్సిపల్ డాక్టర్ బి.మోహన్ లాల్ అడ్మీషన్ ప్రక్రియ పూర్తి చేశారు. రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమశాఖా మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క), కలెక్టర్ దివాకర, ఎస్పీ పి.శబరీష్ లు మొదటి అడ్మీషన్ పొందిన గౌరీని అభినందించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మొత్తం 50సీట్లు ఉండగా ఆలిండియా ర్యాంక్ సాధించిన వారిచే ఏడు సీట్లు భర్తీ అయ్యాయని, మిగిలిన 43సీట్లను తెలంగాణకు చెందిన విద్యార్థులతో భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ మోహన్లాల్ వెల్లడించారు. అయితే ఆలిండియా ర్యాంకులో 23272వ ర్యాంకు సాధించిన గౌరీ ఎంబీబీఎస్లో మొదటి అడ్మీషన్ తీసుకుంది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ఏరియా ఆస్పత్రి సూపరింటెడెంట్ డాక్టర్ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.