ఆనందోత్సవాల మధ్య దీపావళి
- ఇంటింటా బాణసంచా సందడి
వెంకటాపురం, అక్టోబర్ 20, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీ పరిధిలో దీపావళి పర్వదినం ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగింది. ఇంటింటా పిండి వంటల గుమగుమలతో, బాణసంచా పేళుళ్లతో, కొత్త అల్లుళ్లు–కొత్త కోడళ్ళ రాకపోకలతో గ్రామాలు సందడిగా మారాయి. పటాకుల దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు. గత ఏడాదితో పోలిస్తే రేట్లు పెరిగాయని కొనుగోలుదారులు తెలిపారు. మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారి పల్లకి సేవలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సన్నాయి వాయిద్యాలు, కిరోసిన్ కాగడాల వెలుతురులో స్వామి వారి పల్లకి ఊరేగింపుగా ప్రధాన వీధులలో భక్తులకు దర్శన మిచ్చారు. పల్లకి రాక సందర్భంగా భక్తులు శుద్ధి జలాలతో స్వాగతం పలుకుతూ, పసుపు, కుంకుమ, టెంకాయలతో స్వామి వారికి పూజలు చేశారు. ప్రధాన పూజారి నుండి ఆశీర్వచనాలు పొందారు. వేకువ జామునుండే దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, దీపారాధనలు నిర్వహిం చారు. గృహాలన్నీ విద్యుత్ బల్బులు, దీపాల కాంతులతో కళకళలాడుతూ, పండుగ ఉత్సాహాన్ని ప్రతిబింబించాయి. దీపావళి సాయంత్రం బాణసంచా వెలుగులు ఆకాశాన్ని అలంకరించగా, పర్వదినం ఉత్సాహం ప్రజల్లో ఉరకలు వేసింది.