శ్రమదానంతో పంట కాలువ పూడికతీత
— పాలెం ప్రాజెక్టు అధికారులపై రైతుల ఆగ్రహం
వెంకటాపురం నూగురు, అక్టోబర్20, తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం రాచపల్లి, మల్లాపురం గ్రామాల పరిసరాల్లోని పాలెం ప్రాజెక్టు కుమ్మరి కుంట వద్ద నుండి పిల్ల కాలువ పూడి పోవడంతో, ఆయకట్టు చివరి వరకు సాగు నీరు అందక వందలాది ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి. కాలువలో గుర్రపు డెక్కలు, పిచ్చి చెట్లు విస్తరించి నీటి ప్రవాహం పూర్తిగా ఆగిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు మార్లు పాలెం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులకు మొర పెట్టుకున్నా స్పందన లేకపోవడంతో రైతులు స్వయంగా ముందుకొచ్చి శ్రమదానంతో కాలువ పూడికతీత పనులు ప్రారంభించారు. కుమ్మరి కుంట నుండి కోయబెస్త గూడం వరకు జెసిబిని అద్దెకు తీసుకుని గంటకు రూ.1,500 చెల్లిస్తూ పూడికతీత పనులు కొనసాగిస్తున్నారు. ఎకరం, రెండెకరాలు మాత్రమే ఉన్న పేద రైతులు చందాలు వేసుకొని సుమారు రూ.20 వేల వరకు సేకరించి ఈ పనులు చేపట్టారు. మా పంటలు దెబ్బతింటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, కాలువకు గండ్లు పడి నీరు వృథాగా గోదావరిలోకి వెళ్తోందని, నిధులు లేవనే పేరుతో తప్పించుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన కాలువ నుండి కుమ్మరి కుంట, ఉఫ్ఫేడు, వీరాపురం వరకు పూడిక తీత తీవ్రంగా ఉందని రైతులు తెలిపారు. పాలెం ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యంపై గిరిజన, గిరిజనేతర రైతులు మండిపడుతూ “ప్రభుత్వ నిధులు లేవన్న పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్న ఇంజనీరింగ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు. రైతులకు సాగునీరు అందే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.