కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు
- సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి : ఏఐటీయూసీ పిలుపు
వెంకటాపురం, అక్టోబర్ 19, తెలంగాణ జ్యోతి : కార్మికుల శ్రమను దోపిడీ చేస్తూ, కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ పిలుపునిచ్చింది. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం ఏఐటీయూసీ మండల మహాసభ ఏఐటీయూసీ నాయకుడు పోలం కొండయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రవీందర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు సాధించిన 44 కార్మిక చట్టాలను కుదించి 4 కోడ్లుగా మార్చడం ద్వారా కార్పొరేట్ యాజమాన్యాల ప్రయోజనాలకు దోహదం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి, ఎన్నికల తర్వాత అమలు చేయకపోవడం ఇప్పుడు అన్ని పార్టీలకు అలవాటైందని విమర్శించారు..భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ప్రైవేటీకరణ, మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికుల వేతనాలు పెంపు లేమి, అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యలు పరిష్కరించకపోవడం, సివిల్ సప్లై, జీసీసీ హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్లు — ఇవన్నీ ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల శానిటేషన్ కార్మికుల వేతనాలు సమయానికి చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేయాలని, స్కావెంజర్ల వేతనాలు నేరుగా ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని వర్గాల కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏఐటీయూసీ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కుల రాజేందర్, నాయకులు కట్ల రాజు, పోధెం రమేష్, కుడుముల సమ్మక్క, పోధెం సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.