బీసీలను మోసం చేసిన బిజెపి
- వచ్చే ఎన్నికల్లో బిజెపిని బీసీలే రాజకీయంగా భూస్థాపితo చేస్తరు
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం భూపాల్ పల్లి జిల్లా ఇన్చార్జి విజయ గిరి సమ్మయ్య వెల్లడి
మహాదేవపూర్, జులై1,తెలంగాణ జ్యోతి : తెలంగాణ రాష్ట్రం లో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి బీసీలకు ఇస్తామని అధిష్టానం ఊరడించి, ఊరించి, చివరికి బీజేపీ బీసీలను మోసం చేసిందని, 60 శాతం జనాభా ఉన్న బీసీలను కాదని ఒక శాతం ఉన్న అగ్రకుల సామాజిక వర్గానికి చెందిన రామచంద్ర రావు ను పార్టీ అధ్యక్షులుగా బిజెపి కట్టబెట్టి బీసీలను దగా చేసిందని జాతీయ బీసీ సంఘం జిల్లా ఇన్చార్జ్ విజయ గిరి సమ్మయ్య తీవ్రంగా విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీల జపం చేస్తుంటే.. బిజెపి మాత్రం అగ్రకులాల జపం చేస్తుందన్నారు. 6 శాతం ఉన్న బీసీలను కాదని, ఒక శాతం ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రామచందర్ రావుకు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే బిజెపి వచ్చే ఎన్నికలలో ఘోర పరాజయం చవి చూడక తప్పదని ఆయన హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీని సీఎం చేస్తానన్న బిజెపి, చివరికి ఫ్లోర్ లీడర్ గా కూడా అగ్రకులానికి చెందిన మహేశ్వర్ రెడ్డి కి కట్టబెట్టి బిజెపి మాటలకు చేతలకు ఎక్కడ పొంతన లేదని రుజువు చేసుకుందన్నారు. పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వని పార్టీ, రేపు భవిష్యత్తులో బీసీ బిడ్డ నీ సీఎం చేస్తానంటే బిజెపి పార్టీని బీసీలు ఎలా నమ్ముతారని , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపకుండా గత మూడు నెలలుగా తొక్కి పెడుతుందని, ఇప్పుడు బీసీలకు రాష్ట్ర పగ్గాలు ఇవ్వకుండా బిజెపి పచ్చి బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు. బిజెపి అంటే ఇప్పుడు తెలంగాణలో బ్రాహ్మణ జనతా పార్టీగా రామచందర్ రావు నియామకంతో మారిపోయిందని, బిజెపిలో అగ్రకులాలకు ఉన్న విలువ బీసీలకు లేదని ఈ నియామకంతో తేలిపోయిందన్నారు. బిజెపి పార్టీలో అగ్ర కుల హిందువులకు ఒక న్యాయం, బీసీ హిందువులకు ఇంకొక న్యాయo చేస్తు న్నారని, బీసీ హిందువులపై బిజెపి పార్టీలో వివక్షత చూపిస్తుంద నడానికి బీసీ హిందువులకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వక పోవడమే నిదర్శనమన్నారు. బిజెపిలో ఎంతోమంది బీసీలు పార్టీ అధ్యక్ష పదవికి అర్హులు ఉన్నప్పటికీ, వారికి బీసీ కులమే అనర్హతగా మారిందన్నారు. బీసీలను మోసం చేసిన బిజెపిని, ఈరోజు నుండి బీసీల ద్రోహుల పార్టీగా ప్రకటిస్తున్నామని ఆ పార్టీలో ఉన్న బీసీ నేతలు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్న వెంటనే బిజెపికి రాజీనామా చేసి బయటికి రావాలని ఆయన సూచించారు. బీసీలను అవమానించిన బిజెపికి బీసీల బలమేం టో త్వరలోనే రుచి చూపించి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.