ఘనంగా ప్రారంభమైన బీరన్న బోనాలు.
ఘనంగా ప్రారంభమైన బీరన్న బోనాలు.
– ములుగులో గ్రామదేవతలకు జలాభిషేకం
– లింగాలను చెరువులో నుంచి ఆలయానికి తీసుకొచ్చిన యాదవులు
– నేడు ములుగులో 1000 బోనాల పండుగ
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి: యాదవుల ఆరాధ్య దైవం బీరన్న బోనాల పండుగ ములుగు జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభమైంది. ఐదు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో మొదటి రోజున గ్రామదేవతలకు జలాభిషేకం నిర్వహించి శుద్ధి చేశారు. డోలు వాయిద్యాలతో తరలివచ్చిన యాదవులు బొడ్రాయి, పోశమ్మ, పెద్దమ్మతల్లి, నాగదేవత, శ్రీసీతారామాంజనేయ స్వామి ఆలయంలో దేవతలకు నీల్లార గించారు. మహిళలు మంగళ హారతులతో తరలివచ్చి పూజలు నిర్వహించారు. గ్రామదేవతలకు బోనం చేసుకొని వచ్చి సమర్పించారు. పూజారులు ప్రతీ యాదవ ఇళ్లు తిరుగుతూ బలి చల్లారు. అనంతరం బీరన్న ఆలయం నుంచి లింగాలను తీసుకెళ్లి తోపుకుంట వద్ద చెరువులో దాచి ఉంచారు. శనివారం సాయంత్రం సామూహికంగా తరలివెళ్లి లింగాలను తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా పూజారులు పసుపు(బండారి)తో భక్తులకు బొట్టుపెట్టి ఆశీర్వదించారు. ఆదివారం ములుగు పట్టణం లోని సుమారు 500ల కుటుంబాల నుంచి వెయ్యికి పైగా బోనాలతో తరలిరానున్న మహిళలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించే తంతులో పాల్గొంటారు. డోలు వాయిద్యాలతో ప్రత్యేకంగా వరుసల్లో నిల్చున్న బోనాలు మధ్య తిరుగుతూ పూజలు చేస్తారు. అనంతరం బీరన్నకు బోనాలు సమర్పి స్తారు. ఈ వేడుకను చూసేందుకు వేలాదిగా యాదవ కుటుం బాలు ఇప్పటికే ములుగుకు చేరుకున్నాయి. పదిహేనేళ్ల క్రితం జరిగిన ఈవేడుకను తిరిగి ఈఏడాది నిర్వహిస్తుండటంతో బీరన్న పండుగను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.