పకడ్బందీగా పోలింగ్ నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలి

పకడ్బందీగా పోలింగ్ నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలి

  • జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా
  • ఈవిఎం యంత్రాల పనితీరు పై సంపూర్ణ అవగాహన కల్గి ఉండాలి
  • పోలింగ్ కేంద్రం పరిసరాలలో రాజకీయ కార్యకలాపాలు జరపరాదు
  • పోలింగ్ కేంద్రం 100 మీటర్ల పరిధిలో ఎవరు చరవాణి వాడరాదు
  • నామినేషన్ సమయంలో అన్ని డాక్యుమెంట్లను పకడ్బందిగా పరిశీలించాలి
  • ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు సహయ కేంద్రాల ఏర్పాటు
  • పోలింగ్ కేంద్రాలలో ప్రెసిడెంట్ అధికారులు చేయవలసిన విధులపై , ఈ వి ఎం లపై అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్

తెలంగాణ జ్యోతి , భూపాలపల్లి ప్రతినిధి : జిల్లాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా పారదర్శకంగా జరిగేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో లో జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాలలో ప్రిసీడింగ్ సహాయ ప్రిసీడింగ్ అధికారులు చేయవలసిన విధులపై సెక్టోరల్ అధికారులు మాస్టర్ ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా మాట్లాడుతూ* జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండటం చాలా కీలకమని, ముఖ్యమైన నిబంధనల పట్ల అవగాహన ఉంటే పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ ఎలాంటి పొరపాట్లు జరగకుండా సజావుగా జరుగుతుందని అన్నారు. పోలింగ్ అధికారులకు ముఖ్యంగా ఈవీఎం యంత్రాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, మాక్ పోల్ నిర్వహణ, ఈవిఎం యంత్రాల పని తీరు, బాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ ,వివి ప్యాట్ల కనెక్షన్లు, వాటి పని తీరు, మరమ్మత్తు జరిగితే తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు.వివి ప్యాట్లు ప్రజలకు మరింత భరోసా కలిగించేందుకు భారత ఎన్నికల కమిషన్ 2017 నుంచి వాడకలోకి తీసుకుని వచ్చిందని, ఈవిఎం యంత్రాలకు వివి ప్యాట్ల కనెక్షన్ పకడ్బందీగా చేయాలని, పోలింగ్ కేంద్రంలో ఈవీఎంత్రాలను పోలింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు ఉండేలా చూసుకోవాలని అన్నారు. నామినేషన్ల సమయంలో అభ్యర్థులు నామినేషన్ దరఖాస్తు సమర్పించే సమయంలో అవసరమైన అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయో లేవో రెండు మూడు సార్లు పరిశీలించి రసీదు అందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నిక జరిగిన తర్వాత నామినేషన్ లోనే కొన్ని సాంకేతిక అంశాలను చూపుతూ ఎన్నికల చెల్లదంటూ సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తున్నాయని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఎటువంటి రాజకీయ ప్రచారాలు నిర్వహించడానికి వీలులేదని, 200 మీటర్ల పరిధి దాటిన తర్వాత రాజకీయ పార్టీలు 2 కుర్చీలు, టేబుల్ వేసుకోవచ్చని, అక్కడ ఉండే ప్రతినిధులకు అయ్యో భోజన ఖర్చు సైతం అభ్యర్థి ఎన్నికల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎవరు సెల్ ఫోన్ వాడడానికి వీలులేదని, ప్రిసైడింగ్ అధికారి మైక్రో అబ్జర్వర్లకు మాత్రమే సెల్ఫోన్లు వాడవచ్చని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటరు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని , పోలింగ్ కు ముందస్తుగా ప్రతి ఓటర్ కు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయాలని, ఓటర్ సహాయ కేంద్రాల ద్వారా త్వరితగతిన ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉపయోగపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు రెవెన్యూ డివిజన్ అధికారి రమాదేవి నోడల్ అధికారులు తాసిల్దారులు సెక్టోరల్ అధికారులు ఎంపీడీవోలు మాస్టర్ ట్రైనర్స్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.