ములుగులో ఆది కర్మయోగి అభియాన్ శిక్షణా కార్యక్రమం
ములుగు, సెప్టెంబర్ 27, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలోని ఏటిడబ్ల్యూఓ కార్యాలయంలో శనివారం మండల స్థాయి ఆది సహాయ యోగిల శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణలో బంజారా సేవా సమితి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ప్రతినిధి, హైకోర్టు లాయర్ జోగురాం నాయక్ తేజావత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజనుల అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ గారు బడ్జెట్లో ₹79 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. ఆది కర్మయోగి – ధజ్ గోవా పథకం ద్వారా ములుగు జిల్లాలోని 10 మండలాల గిరిజన గ్రామాలను సందర్శించి, గ్రామస్థాయి సమస్యలను గుర్తించి, గ్రామసభ ఆమోదించిన పనులను ఐటీడీఏ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపే అవకాశం లభిస్తుందని వివరించారు. తదుపరి ఐదు సంవత్సరాల్లో ఈ పథకం ద్వారా వెనుకబడిన కోయగూడాలు, తాండాలను అభివృద్ధి చేయడంలో మండల స్థాయి ఆది సహాయ యోగులు కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సెంట్రల్ కోఆర్డినేటర్ సేన నాయక్, ములుగు జిల్లా కోఆర్డినేటర్ ధరమ్ సింగ్, జయశంకర్ జిల్లా కోఆర్డినేటర్ చిన్నబాబు పాల్గొన్నారు. అలాగే గ్రామస్థాయి–మండల స్థాయి కర్మయోగులు రాజు, సురేష్, రాజ్‌కుమార్, రవి వర్మ, రాహుల్, కుమారస్వామి మరియు సహాయ యోగులు రాజేందర్, విద్యాసాగర్ తదితరులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.