ద్విచక్రవాహన అంబులెన్స్ సేవలకు మోక్షం ఎప్పుడో..!
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో ఫోర్ వీలర్ అంబులెన్స్ లు వెళ్ళలేని మారుమూల ప్రాంతాల్లో ఎమర్జెన్సీ కేసులను చూసే లక్ష్యంతో మండలానికి తాజాగా ఐటీడీఎ నుండి ఒక ద్విచక్రవాహన అంబులెన్స్(ఫస్ట్ రెస్పాం డర్అంబులెన్స్)ను కేటాయించారు. మండలానికి అందుబా టులోకి తెచ్చిన ఈ ద్విచక్రవాహన అంబులెన్స్ సేవలు ఇంకా అధికారికంగా ప్రారంభంచలేదు. గత నెల రోజుల క్రితమే ఈ అంబులెన్స్ కన్నాయిగూడెం మండలానికి కేటాయించగా దానికి ప్రత్యేక శిక్షితుడైన ఆపరేటర్ లేకపోవడంతో కన్నాయి గూడెం పిహేచ్ సి ప్రాంగణంలో దానిని ఉపయోగించకుండా పక్కకు పెట్టి ఉంచారని స్థానికులు వాపోయారు. హాస్పిటల్ లో పని చేసే సిబ్బంది నుండే ప్రాథమిక చికిత్స అందించడం లో చురుకుగా విధులు నిర్వహించే ఒక ఉద్యోగికే ద్విచక్ర వాహన అంబులెన్స్ నిర్వహణ బాధ్యతను అప్పగించాలన్న ఆదేశాలతో అంబులెన్స్ ను కేటాయించినట్లు చెపుతున్నారు. ఈ ద్విచక్ర వాహన అంబులెన్స్ అలంకార ప్రాయంగానే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో మారుమూల ప్రాంతాల్లోని రోగులకు ప్రాథమిక చికిత్స అందించేందుకు ఉపయోగపడే విధంగా కేటాయించిన ద్విచక్ర వాహన అంబులెన్స్ లక్ష్యం నెరవేరే దిశగా ఉన్నతాధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తక్షణమే వినియోగంలోకి తేవాలని మండల ప్రజలు స్థానికులు కోరుతున్నారు.