నాకే వైద్యం చేయని ఆస్పత్రిలో సామాన్యుల పరిస్థితి ఏంటి..?
– మాజీ జెడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి
– వైద్యాధికారి పై ఆగ్రహం
ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మాజీ జెడ్పీ చైర్ పర్సన్ గా పనిచేసిన తనకే వైద్యం నిరాకరిస్తున్న ఏరియా ఆసుపత్రి వైద్యులు సామాన్యులకు ఎలాంటి వైద్యం అందిస్తున్నారు అర్థం అవుతుందని బడే నాగజ్యోతి విమర్శించారు. ఏరియా ఆసుపత్రికి సోమవారం రాత్రి 9 గంటలకు జ్వరం వస్తుందని, మెడ కింది భాగంలో గాలి బుడగ రావడంతో ఏమైందో తెలు సుకునేందుకు డ్యూటీ డాక్టర్ని సంప్రదిస్తే ఉదయం రావాలని ఉచిత సలహా ఇచ్చారని ఆరోపించారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో అందుతున్న వైద్యంపై నాగజ్యోతి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జడ్పీ చైర్ పర్సన్ గా పని చేసిన తనకే ఇలాంటి చేదు అనుభవం ఎదురైతే వైద్యులు, ఆరోగ్య సిబ్బం ది సామాన్య ప్రజల పట్ల ఎలా స్పందిస్తున్నారో అవగతం అవుతుందని తీవ్రంగా స్పందించారు. వైద్యులు సిబ్బంది రోగులతో మర్యాదగా ప్రవర్తించడం లేదని అన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంటనే స్పందించాలని, రోగులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని నాగజ్యోతి డిమాండ్ చేశారు.