తాడ్వాయి అడవులపై వాతావరణం దాడి.. ఆలస్యంగా వెలుగులోకి…
– ఎర్త్ కేక్ నా.. గాలి బీభత్సమా..?
– తీవ్ర గాలులతో వేల సంఖ్యలో నేలకూలిన చెట్లు
– ఎటూ తేల్చలేని అటవీ అధికారులు
ములుగు ప్రతినిధి : అడవులపై వాతావరణం దాడి చేసిందా..? గాలివాన బీభత్సం సృష్టించిందా..? లేక ఎర్త్ కేక్ నా..? ములుగు జిల్లాలోని తాడ్వాయి అడవుల్లో అసలు ఏం జరిగింది.? అనేది అంతుపట్టని సమస్యగా మిగిలింది. ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో భారీ వృక్షాలు నేలరా లడం.. అదికూడా ఓ వరుస క్రమంలో సుమారు ఎటూ కిలో మీటరున్నర విస్తీర్ణంలో నేలరాటడంపట్ల ఇటు అధికారులు, ప్రజలు విస్తుపోతున్నారు. ఆగస్టు 31న భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో తీవ్ర గాలులు వీయడంతో తాడ్వాయి నుంచి మేడారం రూట్ లో కిలోమీటర్ మేర రోడ్డుకు అడ్డంగా వరుస క్రమంలో చెట్లు నేలకొరిగాయి.. ప్రధాన రహదారికి ఇరు వైపు లా కిలో మీటరున్నర విస్తీర్ణంలో భారీ వృక్షాలన్నీ నేలకూ లాయి. ఈ వింత ధోరణితో ఫారెస్ట్, జిల్లా అధికారులు నివ్వెర పోయారు. రోడ్డుపై పడిన చెట్లను పోలీసు అధికారులు గంటలతరబడి శ్రమించి డోజర్లు, జేసీబీల సహాయంతో తొలగించారు.
మూడు రోజుల్లోనే ప్రకృతి విధ్వంసం
ఆగస్ట్ 30 నుంచి 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలు మరియు విస్తృతమైన వరదల మధ్య ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యంలో గణనీయమైన విధ్వంసం సృష్టించిందని ప్రకృతి ప్రేమికులు అంచనా వేస్తున్నారు. సుమారు 200 హెక్టార్లలో విస్తరించి ఉన్న సుమారు 50వేల చెట్లు 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో రేఖీయ నమూనాలో పడి పోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాడ్వాయి – మేడారం గ్రామాల మధ్య జరిగిన ఈ వింత ఘటనతో అటవీశాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు. నల్లమద్ది, తెల్లమద్ది, ఎగిస, జువ్వి, నారెప, మారేడు, ఇప్ప వంటి మిశ్రమ జాతుల చెట్లను ఆగస్టు 31న సాయంత్రం 5.30గంటల నుంచి 7.30 గంటల మధ్య కుప్పకూలినట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. ఫారెస్ట్ జిల్లా అధికారులు డ్రోన్ సహాయంతో చిత్రీకరించి ఎంతమేర వృక్షాలు నేలరాలాయో పరిశీలించారు. అయితే భారీ గాలులకు చెట్లు నేలకొరిగాయా లేక ఏదైనా భూకంపం లాంటిది సంభవించిందా అనే కోణంలో ప్రశ్నలు వినిపిస్తు న్నాయి. ఎర్త్ కేక్ కాకుంటే అంత విస్తీర్ణంలో భూపొరల్లో ఏవైనా మార్పులు సంభవించాయా అనే కోణంలో పర్యా వరణ వేత్తలు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ములుగు జిల్లాలోని తాడ్వాయి అడవుల్లో క్లౌడ్ బరస్ట్ జరిగిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సంఘటన నాలుగు రోజుల క్రితం జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా మంగళవారం అడవి శాఖ సిసిఎఫ్ తాడువాయి మేడారం రూట్లో పడిపోయిన చెట్లను పరిశీలించారు. వేల వృక్షాలు ఏ విధంగా పడ్డాయి అనే విషయంపై ఆరా తీశారు. డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తో కలిసి నేల కూలీల చెట్లను పరిశీలించిన అనంతరం భారీ మొత్తంలో వృక్షాలు నేలకు కూలడంపై ఆరా తీశారు. ఇంకేమైనా కారణాలు ఉన్నాయని కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.