మేడారం జంపన్న వాగుకు నీటి విడుదల.
– వాగులో నీటి కొరతతో ముందుగానే అధికారుల గ్రీన్ సిగ్నల్
– జంపన్న వాగుకు బుధవారం చేరనున్న లక్నవరం నీరు
ములుగు, తెలంగాణ జ్యోతి : మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్న క్రమంలో వారి కొరకు ముందస్తు గానే అధికారులు లక్నవరం నీటిని విడుదల చేశారు. ప్రస్తుత నీటిమట్టం 24 అడుగుల 8 అంగుళాలు నీరు నిల్వ ఉండగా మేడారం జాతర నేపథ్యంలో రబి పంటకు అధికారులు ముందస్తు ప్రణాళిక ప్రకారం తైబందీ ఖరారు చేశారు. అయితే మేడారం సమ్మక్క సారమ్మ తల్లులలో జాతరకు ముందస్తు మొక్కులతో భక్తులు నిత్యం లక్షల్లో వస్తున్నారు. ఈ నేపథ్యంలో జంపన్న వాగులో స్నానం చేసి పుణ్య స్థానాలతో భక్తులు పునీతులు అవుతారు. కాగా జంపన్నవాగులో నీరు అడుగంటిపోవడంతో లక్నవరం ద్వారా ప్రతి జాతర లాగానే ఈ జాతరకు సైతం అధికారులు నీటిని విడుదల చేశారు. సోమవారం సాయంత్రం లక్నవరం నీటిని విడుదల చేయగా మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం వరకు పూర్తిస్థాయిలో జంపన్న వాగుకు లక్నవరం నీరు చేరుకునే అవకాశం ఉంది. లక్నవరం నీరు జంపన్న వాగుకు చేరితే పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు ఆనందంతో పులకరించనున్నారు.