సమస్యల్లో పశు వైద్యశాల..!
– వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత
– మొక్కుబడిగా పశు వైద్యసేవలు
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం: గ్రామాల్లో పశువైద్యం అందని ద్రాక్షగా మారింది. ముఖ్యంగా సిబ్బంది కొరత వేధిస్తోంది. చుట్టుపక్కల గ్రామాలకు ఒక్క సిబ్బంది మాత్రమే చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.దీంతో వైద్యంలేక ఎదురుచూపులే మిగిలుతున్నాయి. పశువైద్యశాల భవనాలు శిథిలావస్థకు చేరుకుంది.. వర్షానికి భవనాల్లోకి నీరు చేరడం, ప్రహరీ లేకపోవడం, అక్కడ విధులు నిర్వహించేందుకు సిబ్బంది జంకుతున్నారు. ఒక్క సిబ్బంది మాత్రమే విధులకు వస్తున్నారు. వీరికి సహకరించే సిబ్బంది లేకపోవడంతో ఇబ్బం దులు పడుతున్నారు.ఏజెన్సీ ప్రాంతంలోని కన్నాయిగూడెం మండలంలో 11 గ్రామ పంచాయతీల్లో ఒకే ఒక్క పశు వైద్య శాల ఉండగా కార్యాలయ సబార్డినేట్, వెటర్నరీ అసిస్టెంట్లు లేరు.గతంలో ఆసుపత్రుల్లో వెటర్నరీ అసిస్టెంట్లు ఉండేవారు. పశువైద్య కేంద్రంలో అటెండర్ ఉన్నా మూడు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. మారుమూల గ్రామాలైన ఐలాపురం, కంతనపల్లి, చిట్యాల, బూపతిపురం, తుపాకుల గూడెం, ఈ గ్రామాలు పశువైద్యశాలకు దూరంగా ఉండడంతో పశువులకు వైద్యం అందక రైతులు ఇబ్బందులు పడుతు న్నారు. మండలంలోని పశువైద్యశాల ఉన్నప్పటికీ పది కిలో మీటర్ల దూరంలో ఉన్న పశువైద్యశాలకు మిగతా గ్రామాల రైతులు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ప్రవేట్ లో రైతులే స్వయంగా మందులు కొనుగోలు చేసి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
శిథిలావస్థకు చేరిన భవనం
మండల కేంద్రంలోని పశువైద్యశాల పూర్తి స్థాయిలో శిథిలా వస్థకు చేరింది. భవనం చుట్టూ ప్రహరీ లేకపోవటంతో రక్షణ కరువైంది.ఈ భవనం సుమారు 30 సంవత్సరాల క్రితం నిర్మించారు.అప్పటి నుంచి నేటి వరకు మరమ్మతులు చేపట్ట లేదు. వర్షాకాలంలో స్లాబు వెంట వర్షపు నీరు లీకువు తుండ టంతో రికార్డులు, మందులు తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి నూతన భవనం, డాక్టర్లను నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు.