పశువులు తరలిస్తున్న వ్యాన్ బోల్తా
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం రాచపల్లి సమీపంలో శనివారం అర్ధ రాత్రి సమయంలో పశువులతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది పశువులకు పైగా మృతి చెందగా, మిగతా పశువులు సురక్షితంగా బయటపడ్డాయి. భద్రాచలం, చర్ల వైపు నుండి కొంత మంది వ్యాపారులు పశువులను హైదరాబాద్, వరంగల్ కబేలాకు తరలిస్తున్నట్లు సమాచారం. అయితే వెంకటాపురం మండల కేంద్రం ప్రధాన రహదారి నుండి పశువుల వ్యాను వెళ్ళకుండా, వీరాపురం రోడ్డు గుండా పాలెం ప్రాజెక్టు రాచపల్లి, బొల్లారం, మురుమూరు మీదుగా ప్రధాన రహదారి పైకి చేరుకొని, అక్కడనుండి ఏటూరునాగారం, వరంగల్ మీదుగా హైదరాబాద్ పశువుల వ్యాన్లు వెళ్తున్నాయి. డ్రైవర్ అతివేగంగా నడపడంతో కాలువ వద్ద వ్యాన్ బోల్తా కొట్టి అనేక పశువులు చనిపోగా, మరికొన్ని పశువులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. సమాచారం తెలిసిన వెంటనే వెంకటాపురం పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని కేసు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.