Upi | యూపీఐ పేమెంట్లపై త్వరలో కొత్త రూల్..!
Upi | యూపీఐ పేమెంట్లపై త్వరలో కొత్త రూల్..!
– రూ. 2వేల కన్నా ఎక్కువ లావాదేవీలు చేస్తే.. 4 గంటలు ఆలస్యం.. ఎందుకో తెలుసా..?
డెస్క్ : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? యూపీఐ లావాదేవీలపై త్వరలో కొత్త రూల్ అమల్లోకి రానుంది. ఈ కొత్త నిబంధన ప్రకారం.. యూపీఐ లావాదేవీలు సహా ఇతర పేమెంట్లు ఆలస్యం కానున్నాయి. అంటే.. మీరు చేసే మొదటి లావాదేవీ లేదా రూ.2వేలకు మించి లావాదేవీలను యూపీఐ ద్వారా చేసినట్టయితే ఆయా లావాదేవీలు ఆలస్యం కానున్నాయి. ఎందుకంటే.. ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వినియోగదారులపై ప్రభావం చూపే కొత్త ప్రక్రియను భారత ప్రభుత్వం రూపొందిస్తు న్నట్లు సమాచారం. ఆన్‌లైన్ లావాదేవీలలో మోసాన్ని నిరోధించే ప్రయత్నంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మొదటి లావాదేవీకి కనీస కాలపరిమితిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇదే అమ ల్లోకి వస్తే.. వినియోగదారులు రూ. 2వేల కన్నా ఎక్కువ లావాదేవీ లకు నాలుగు గంటల ఆలస్యం కావచ్చు. అంటే.. దాదాపు నాలుగు గంటలు గడిచిన తర్వాతనే లావాదేవీని అమలు చేయాలని భావి స్తున్నట్టు నివేదిక వెల్లడించింది. ఏదైనా పొరపాటుగా లావాదేవీ జరిగినప్పుడు ఆయా లావాదేవీలను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
సైబర్ మోసాలను నివారించడానికి : వినియోగదారుల్లో ఇంతకు ముందెన్నడూ లావాదేవీలు జరపని మరో యూజర్‌కు రూ. 2వేల కన్నా ఎక్కువ మొదటి పేమెంట్ చేసినప్పుడు నాలుగు గంటల కాలపరిమితి వర్తిస్తుంది. ఈ విధానంలో డిజిటల్ పేమెంట్లకు కొంత కష్టతరమైనప్పటికీ, సైబర్ సెక్యూరిటీ ఆందోళనలను పరిష్కరించ డానికి ఇది తప్పక అవసరమని ప్రభుత్వ అధికారులు విశ్వసిస్తు న్నారని తెలిపింది. ఇన్‌స్టంట్ పేమెంట్ సర్వీసు (IMPS), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS), యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI)తో సహా వివిధ డిజిటల్ పేమెంట్ పద్ధతులకు ఈ నిబంధన వర్తించవచ్చనని నివేదిక స్పష్టం చేసింది.
కొత్త యూపీఐ అకౌంట్లపై పరిమితి : నివేదిక ప్రకారం.. మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మొదటి లావాదేవీ మందగించడం లేదా పరిమితం చేయడం మాత్రమే లక్ష్యం కాదు. ఎందుకంటే.. కొన్ని డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ ఇప్పటికే ఈ పద్ధతిని కలిగి ఉన్నాయి. గత పేమెంట్ హిస్టరీతో సంబంధం లేకుండా ఇద్దరు యూజర్ల మధ్య జరిగే ప్రతి మొదటి లావాదేవీని నిశితంగా గమనించనుంది. ప్రస్తుతం, మీరు కొత్త యూపీఐ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మొదటి 24 గంటల్లో గరిష్టంగా రూ. 5వేలు పంపవచ్చు. అదేవిధంగా, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT)లో లబ్ధిదారుని యాడ్ చేసిన తర్వాత మీరు 24 గంటలలోపు రూ. 50వేల వరకు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.
ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ.. ‘మొదటిసారి రూ. 2వేల కన్నా ఎక్కువ డిజిటల్ లావాదేవీలకు నాలుగు గంటల కాల పరిమితిని ప్రభుత్వం విధించనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, గూగుల్, రేజర్‌పే వంటి టెక్ కంపెనీలతో సహా ప్రభుత్వం, పరిశ్రమ వాటాదారులతో చర్చించనుంది. నవంబర్ 28న జరిగే సమావేశంలో డిజిటల్ పేమెంట్ మోసాలు, ఆర్థిక నేరాలు, ఈ కార్యకలాపాలను ఎదుర్కోవడానికి అవసరమైన సైబర్ సెక్యూరిటీ చర్యలపై చర్చించనున్నారు.